ఇచ్చిన హామీలకన్నా ఎక్కువే చేశా
- కొందరు కోర్టులకెళ్తూ నాకున్న మంచిపేరును చెడగొడుతున్నారు
- ప్రతి పనినీ అడ్డుకుంటున్నారు
- వీళ్లకు, టైస్టులకు పెద్ద తేడా ఏముంది?
- కాకినాడ సభలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘‘ఎన్నికల్లో ఏమైతే చెప్పానో అవన్నీ పూర్తి చేశాను. అప్పుడు చెప్పిన దానికంటే ఇంకాస్త ఎక్కువే చేశాను. నాకు మంచిపేరు వస్తుందంటే చాలు.. కొందరు కోర్టులకు, ట్రిబ్యునళ్లకు పోరుు ఆ పేరు చెడగొడుతున్నారు. వీళ్లకు, టెరర్రిస్టులకు పెద్ద తేడా ఏముంది?’’ అంటూ సీఎం చంద్రబాబు విపక్షాలపై ధ్వజమెత్తారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ‘దోమలపై దండయాత్ర ర్యాలీ’ని ప్రారంభించాక ఆనందభారతి గ్రౌండ్‌సలో ఏర్పాటుచేసిన ‘ఆరోగ్య ఆంధ్రప్రదేశ్’ సభలో సీఎం మాట్లాడారు. విభజన తరువాత ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, అభివృద్ధి కావాలన్నా అనుభవమున్న తనవల్లే జరుగుతుందనే.. ప్రజలు తనకు పట్టం కట్టారన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాననన్నారు. ‘రెండు పంటలకూ నీరిచ్చి ఎకరం కూడా ఎండిపోకుండా చూశా. రైతుల్ని రూ..24 వేల కోట్ల మేరకు రుణవిముక్తి చేశా. డ్వాక్రా సంఘాల్లోని 84 లక్షలమందికి రూ.10వేలు వంతున అందజేశా. తెలుగుదేశం కాక మరే ప్రభుత్వం ఇలా చేసిందో చెప్పాలి’ అని సవాలు విసిరారు. త్వరలో మహిళాసంఘాల్లోని ప్రతి సభ్యురాలికీ రూ.3వేలు వంతున ఖాతాల్లో వేస్తామన్నారు. స్వచ్ఛమైన, నీతివంతమైన పాలన అందిస్తున్నానన్నారు. కొందరు రాజకీయాల ముసుగులో ప్రతి పనినీ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఆక్వా ఫుడ్ పార్క్, రాజధాని, పట్టిసీమ, భోగాపురం ఇలా ప్రతిదాన్నీ వ్యతిరేకిస్తున్నారన్నారు. అరుునా తాను లెక్కచేయనని, అనుకున్న పనిని చేసుకుంటూ ముందుకుపోతానన్నారు.కాపులకు సామాజిక న్యాయం చేద్దామనే ప్రయత్నంలో ఉన్నానని చెప్పారు. వారితోపాటు బీసీలకూ న్యాయం చేస్తానన్నారు.
విద్యార్థి ప్రసంగం.. హెచ్‌ఎంపై ఆగ్రహం
బహిరంగసభలో ఓ విద్యార్థిని పిలిచి మాట్లాడాలని సీఎం కోరడంతో వేదికపెకైక్కిన కాకినాడ రూరల్ పగడాలపేట జెడ్పీ హైస్కూల్ విద్యార్థి లక్ష్మీపతివర్మ.. స్కూల్ పరిసరాల్లో మందుబాబుల ఆగడాలు, అపరిశుభ్రత, తదితర ఇబ్బందుల గురించి చెప్పడంతో సీఎం మైక్ అందుకుని.. హెచ్.ఎం గోపాలకృష్ణను ‘నువ్వేం చేస్తున్నా’వంటూ ప్రశ్నించారు. అలాగే రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిని కూడా ‘ఏవమ్మా నువ్వు సపోర్టు చేస్తున్నావా?’ అని నిలదీశారు. మద్యం సేవించడం వంటి ఘటనలను నియంత్రించాలని, అలాంటివారిపై పీడీయాక్టు కింద కేసు పెట్టాలని పోలీసుల్ని ఆదేశించారు.