టిక్కెట్ కొని శ్రీమంతుడు చూసిన చంద్రబాబు
విజయవాడ : ఆంధ్రప్రదేవ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సినిమా చూశారు. నిజమే.. కొద్దిసేపు థియేటర్‌లో కూర్చుని శ్రీమంతుడు సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు. ఇందుకోసం ఆయన రూ.1,200 పెట్టి టికెట్ కూడా కొన్నారు. దేశంలోనే మొదటిసారిగా విజయవాడ పండిట్ నెహ్రూ ఆర్టీసీ బస్టాండ్‌లో నిర్మించిన వైస్క్రీన్ థియేటర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ప్రారంభించారు.
రూ.1,200తో టికెట్ కొన్న ఆయన థియేటర్‌లో కూర్చుని సేదతీరారు. పలువురు ఆర్టీసీ సిబ్బందితో కలిసి సినిమా చూశారు. అనంతరం ఫుడ్‌కోర్టు ప్రారంభించారు. వైస్క్రీన్ యజమాని వైవీ రత్నం థియేటర్ విశేషాలను ఆయనకు వివరించారు. త్వరలో రాష్ట్రంలోని ప్రతి మండలంలో వైఎస్‌టీడీ (వైస్క్రీన్ ట్రేడ్ డెవలప్‌మెంట్) సెంటర్లు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అందులో మిని థియేటర్‌తో పాటు పుడ్‌కోర్టు, మీసేవా, ఏటీఎం, సైబర్ కేఫ్, రిటైల్ మార్కెట్, అన్ని రకాల సమాచారం కోసం ఫ్రంట్ ఆఫీస్ ఏర్పాటుచేసి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.
ఆర్టీసీ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి సాంకేతిక పరిజ్ఞానం అందించిన సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజి డీన్ డాక్టర్ బి.పాండురంగారావును సీఎం సన్మానించారు. అలాగే గుడివాడ డిపో ఆర్టీసీ కానిస్టేబుల్ కె.శ్రీనివాసరావు ఇటీవల మృతిచెందడంతో ఆయన భార్య నాగపుష్పవతికి రూ.10లక్షల బీమా చెక్కును అందించారు.