
చంద్రబాబువి హత్యా రాజకీయాలు
►ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం
►రాజకీయ ఎదుగుదల ఓర్వలేకే రామిరెడ్డిని హత్య చేశారు
►ఇలాంటి చర్యలతో సీఎం సిగ్గుతో తలదించుకోవాలి
సాక్షి ప్రతినిధి, కడప: ఇరవై ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో రాజకీయం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫ్యాక్షన్‌ను ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు హత్యా రాజకీయాలను పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె మండల ఉపాధ్యక్షుడు, అలవలపాడు ఎంపీటీసీ సభ్యుడు గజ్జెల రామిరెడ్డి ఈనెల 9న రాజకీయ ప్రత్యర్థుల చేతిలో దారుణంగా హత్యకు గురయ్యారు. ఆదివారం సాయంత్రం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అలవలపాడు గ్రామంలో రామిరెడ్డి సమాధిని సందర్శించి, కుటుంబసభ్యులను పరామర్శించారు. రామిరెడ్డి సతీమణి రమణమ్మ, ఇతర బం«ధువులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు సార్.. ఎవ్వరికి ఎలాంటి హాని తలపెట్టని వ్యక్తిని దారుణంగా నరికి చంపారని బోరున విలపించారు. వారిని ఓదార్చిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే..
‘‘పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె మండలం అలవలపాడు గ్రామంలో 20 ఏళ్లుగా ఎలాంటి ఘటనలు లేవు. రామిరెడ్డి వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీటీసీ సభ్యుడుగా గెలిచి వేంపల్లె మండల ఉపాధ్యక్షుడుగా ఉన్నారు. రామిరెడ్డి ఎవరితో గొడవ పెట్టుకునే వ్యక్తి కూడా కాదు. రామిరెడ్డిని ఎందుకు చంపారో.. చంపిన వారికి కూడా తెలియదు. రాజకీయంగా రామిరెడ్డి ఎదుగుతుండటం.. గ్రామంలో ప్రజాబలం బాగా పెరగడం, ఎంపీటీసీగా గెలుపొందడమే హత్యకు కారణం. ‘పైన ఉన్నది మా ప్రభుత్వమే.. మాకు చంద్రబాబు ఆశీస్సులున్నాయి, కాపాడుతారు.. ప్రోత్సహిస్తారనే భరోసా’తో రామిరెడ్డిని హత్య చేశారు.
మోటారుబైకుపై వస్తున్న రామిరెడ్డిని వెనుకవైపు నుంచి సుమోతో ఢీకొట్టి కిందపడిపోయిన వెంటనే కత్తులతో నరికి దుర్మార్గంగా చంపారు. ఇలాంటి సంఘటనతో చంద్రబాబునాయుడు సిగ్గుతో తలదించుకోవాలి. రాజకీయాలు చేసేటప్పుడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకోవడానికి ఏమేమి చేయాలో అవి చేయాలి.. కానీ ఇలాంటి హత్యా రాజకీయాలు కాదు. రాజకీయం కోసం ప్రశాంతంగా ఉన్న మా గ్రామాల్లో ఫ్యాక్షన్ పెంచి పోషిస్తున్న వ్యక్తి చంద్రబాబునాయుడు. అలవలపాడు గ్రామంలో రామిరెడ్డిని ఇంతమంది ప్రేమిస్తున్నారు. చనిపోయిన తర్వాత ఎంతోమంది బాధపడుతున్నారు. చంద్రబాబుకు రామిరెడ్డి కుటుంబం ఉసురు తగులుతుంది’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.