దిష్టిబొమ్మను దహనం చేస్తున్న నాయకులు
మెట్‌పల్లి : మెదక్ జిల్లా కొండపాక మండలం ఎర్రవల్లిలో మల్లన్నసాగర్ ముంపు బాధితులపై పోలీసులు లాఠీచార్జీ చేయడాన్ని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ నాయకులు సోమవారం పట్టణంలోని జాతీయ రహదారిపై సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. నాయకులు మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిర్వాసితులపై లాఠీచార్జీ చేయడం అమానుషమన్నారు. ప్రభుత్వం ఈ సంఘటనపై విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎండీ రైసుద్దీన్, ఆకుల ప్రవీణ్, దోమకొండ రమేశ్, పొట్ట ప్రేమ్, కోట అనిల్, బత్తుల దీక్షిత్, సద్దాం, నదీం మోరెపు తేజ ఉన్నారు.
నిర్వాసితులపై లాఠీచార్జి అమానుషం
మల్లన్నసాగర్ భూ నిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జి అమానుషమని కాంగ్రెస్ మండల అధికార ప్రతినిధి బోయిని హన్మాండ్లు అన్నారు. సోమవారం మండలంలోని పాతదాంరాజుపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పోలీసులు లాఠీచార్జిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం మెండిగా వ్యవహరిస్తూ మల్లన్నసాగర్ ప్రాజెక్టుకోసం రైతుల వద్ద నుంచి బలవంతంగా భూ సేకరణ చేయడం దారుణమన్నారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంటన స్థానిక నాయకులు ఉన్నారు.