సీమపై సీఎం వివక్ష
సీమపై సీఎం వివక్ష
Published Wed, Jan 11 2017 9:56 PM | Last Updated on Tue, Sep 5 2017 1:01 AM
- ఆర్పీఎస్ అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
కర్నూలు సిటీ: రాయలసీమను సీఎం చంద్రబాబు నాయుడు చిన్నచూపు చూస్తున్నారని, ఈ విషయంపై దమ్ముంటే టీడీపీ నేతలు బహిరంగ చర్చకు రావాలని రాయసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సవాల్ చేశారు. బుధవారం నగరంలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీమ ప్రజలకు ఉద్యోగాల్లోనూ, పదోన్నతుల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో రాయలసీమలో ఏర్పాటు చేయాల్సిన ప్రముఖ విద్యా సంస్థలను కోస్తా ప్రాంతానికి తరలించారని ఆరోపించారు. సీమకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రికి లేఖలు రాస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 1974లో జోనల్ వ్యవస్థ ఏర్పడిందన్నారు. సీమ ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత వల్లే ఇటీవల ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంలో సీఎం చంద్బాబు.. అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించారన్నారు. అయితే గతంలో ఇలా చేసిన ప్రకటనలకు దిక్కు లేకుండా పోయిందని..చిత్తశుద్ధి ఉంటే ఫ్రీజోన్ ప్రకటనకు చట్ట బద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. నిధులు, నీళ్లు, ఉద్యోగాల్లో అన్యాయం జరుగడం వల్లే తెలంగాణ ఉద్యమం వచ్చిన విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేసుకోవాలన్నారు. సీమలో కనీసం తాగు నీటికి కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. చట్ట ప్రకారం కేటాయించిన వాటా మేరకు నీరు అందడం లేదన్నారు. పది డిమాండ్లతో ఈ నెల 18, 19తేదీల్లో దీక్షలు చేపట్టనున్నట్లు బైరెడ్డి తెలిపారు.
Advertisement