
రెవెన్యూ శాఖకు రూ.5 కోట్ల బడ్జెట్
♦ రికార్డుల సవరణ, నిర్వహణకు ల్యాండ్ హబ్ అకాడమీ
♦ రెవెన్యూశాఖ సమీక్షలో సీఎం
సాక్షి, విజయవాడ బ్యూరో: రెవెన్యూ శాఖ అవసరాల నిమిత్తం తక్షణం రూ.5 కోట్ల బడ్జెట్‌ను మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. దీంతోపాటు 200 సర్వేయర్ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. ఇందుకు అవసరమైన విద్యార్హతలపై పరిశీలన జరిపి తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో రెవెన్యూశాఖ అధికారులతో జరిగిన సమీక్షలో సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ల్యాండ్ సర్వే, రికార్డుల సవరణ, నిర్వహణకు ఒక ల్యాండ్ హబ్ అకాడమీని ఏర్పాటు చేయాలని, ఈ అకాడమీ భూముల సర్వే, రెవెన్యూ రికార్డులను ఆధునీకరించడంలో, మ్యాపులను డిజిటలైజ్ చేయడంతో రాష్ట్ర అవసరాలను తీరుస్తుందన్నారు. ఆ తర్వాత కన్సల్టెంటుగా మారి పొరుగు రాష్ట్రాలకు సేవలందిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రస్తుతం 700 మంది ప్రభుత్వ సర్వేయర్లున్నారని, కొత్తగా వచ్చిన ఈటీఎస్ మిషన్లపై పనిచేయడానికి వీరికి 45 రోజులపాటు శిక్షణ ఇప్పించాలని ఆదేశించారు. సర్వేయర్లు అందరికీ వెంటనే ట్యాబ్‌లు ఇవ్వాలని ఆదేశించారు
కొన్ని శాఖల్లో ఆదాయం తగ్గుతోంది
నాయకత్వం సరిగా ఉన్న శాఖల్లో రాబడి బాగుందని, సమర్థ నాయకత్వం లేని శాఖల్లో ఆదాయం తగ్గుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. బుధవారం రాత్రి క్యాంపు కార్యాలయంలో ఆదాయార్జిత శాఖలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబడి విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు.
మార్చి నుంచి ఇంటింటికీ ఇంటర్నెట్
వచ్చే మార్చికల్లా రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఇంటర్నెట్, వీడియో, టెలిఫోన్ సేవలను అందించే లక్ష్యంతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. బుధవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఫైబర్ గ్రిడ్, ఇన్‌క్యాప్, విద్యుత్ శాఖల అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఫైబర్ గ్రిడ్ పనులను ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో రూ. 333 కోట్లతో జరుగుతున్న తొలి విడత ఫైబర్ గ్రిడ్ పనుల ప్రగతిని సీఎం సమీక్షించారు.