20న ఆర్మూర్‌కు సీఎం కేసీఆర్ రాక
►ప్రపంచ బ్యాంకు నిధులతో నిర్మించిన ‘ఎత్తిపోతల’కు మిషన్ భగీరథతో అనుసంధానం
►ఈ నెల 13న ట్రయల్ రన్‌కు ఏర్పాట్లు
►ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం
►ఆర్మూర్‌లో భారీ బహిరంగ సభ
ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలోని 42 వేల మంది జనాభాకు తాగునీటిని అందించడానికి శ్రీరాం సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పనులు చివరి దశకు చేరుకోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈ నెల 20న ప్రారంభోత్సవం చేయడానికి అధికారులు నిర్ణయించారు. ఈ నెల 13న తాగునీటి పథకం ట్రయల్ నిర్వహించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మంగళవారం తెలిపారు. అనంతరం ఆర్మూర్ పట్టణంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తారని వివరించారు.
‘ఎత్తిపోతల’తో తప్పనున్న నీటి ఇబ్బందులు
ఆర్మూర్ పట్టణం రోజురోజుకీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నా పట్టణ ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చడానికి సహజ నీటి వనరులు అందుబాటులో లేవు. దీంతో ఏళ్ల తరబడి బోరు బావులపైనే ఆధారపడి తాగునీటి సరఫరా చేస్తున్నారు. వేసవి కాలంలో భూగర్భ జలాలు అడుగంటడంతో తాగునీటి కొరతతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో తలాపునే ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో ఎత్తిపోతల పథకం నిర్మించి ఆర్మూర్ పట్టణానికి మళ్లించాలని పాలకులు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రపంచ బ్యాంకు నిధులతో ఈ పథకం నిర్మాణం చేయడానికి సన్నాహాలు చేశారు. ఏళ్ల తరబడి నిరీక్షణ అనంతరం ప్రపంచ బ్యాంకు రూ. 114 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో రెండు దశల్లో ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు.
మొదటి విడతలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో జలాల్‌పూర్ వద్ద ఇన్‌టెక్ వెల్ నిర్మాణం, ఆర్మూర్ పట్టణం వరకు 19 కిలోమీటర్ల పొడవునా పైప్‌లైన్ నిర్మాణం, పట్టణంలోని రాజుల గుట్ట వద్ద, జిరాయత్ నగర్‌లో, టీచర్స్ కాలనీల్లో 4 లక్షల 50 వేల లీటర్ల కెపాసిటితో ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. రెండో విడతలో గృహాల వద్ద నల్లాలు, మీటర్ల బిగింపునకు రూ. 2 కోట్లతో పనులు చేపట్టాల్సి ఉంది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ 2013 డిసెంబర్ 10న అగ్రిమెంట్ చేసుకున్నాడు. అగ్రిమెంట్ అయిన రెండేళ్లలోపు పనులు పూర్తి చేయాల్సి ఉండగా 2014లో ఎన్నికల కారణంగా కాంట్రాక్టర్ పనులను ప్రారంభించలేదు. దీంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 ఆగస్టు 7న ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటి సారిగా జిల్లా పర్యటనలో భాగంగా ఆర్మూర్‌కు వచ్చి తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసారు. ఏడాది కాలంలో స్వయంగా తానే వచ్చి ఇంటింటికీ నల్లాను ప్రారంభిస్తానని పేర్కొన్నారు. ఇంతలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ ఇంటింటికీ తాగునీటిని అందించడానికి మిషన్ భగీరథ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించింది.
దీంతో ప్రపంచ బ్యాంకు నిధులతో నిర్మించనున్న ఈ ఎత్తిపోతల పథకం డిజైన్‌లో, ఇన్‌టెక్‌వెల్ నిర్మాణంలో పలు మార్పులు చేసి అదనంగా రూ. 41 కోట్లు కేటాయించారు. ఈ మార్పుల కారణంగా పనుల్లో ఆలస్యం జరుగుతూ వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆర్మూర్ పట్టణ ప్రజలకు తాగునీటిని అందించాలంటూ మెగా కన్‌స్ట్రక్షన్ కంపెనీపై ఒత్తిడి తేవడంతో నిర్మాణం పనులను వేగవంతం చేశారు. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ సమీపంలోని జలాల్‌పూర్ శివారులో ఇన్‌టెక్‌వెల్ నిర్మాణం పనులు పూర్తయ్యాయి. 17 మీటర్ల లోతు, 46 మీటర్ల వెడల్పుతో తవ్వకం పనులు పూర్తి చేసి ఇన్‌టెక్‌వెల్ నిర్మాణాలు పూర్తి చేశారు. బాల్కొండ మండల కేంద్రం సమీపంలోని గుట్టపై నిర్మించాల్సిన నీటి శుద్ధి ట్యాంక్ నిర్మాణం పూర్తయింది. జలాల్‌పూర్ ఇన్‌టెక్ వెల్ నుంచి ఆర్మూర్ వరకు 19 కిలో మీటర్ల పొడవునా పైప్‌లైన్ నిర్మాణం పూర్తయింది. ఆర్మూర్‌లోని వీధుల్లో 106 కిలో మీటర్ల పొడవునా పైప్‌లైన్ నిర్మాణం పనులు జరగాల్సి ఉండగా 95 కిలో మీటర్ల పైప్‌లైన్ మాత్రమే పూర్తయింది.
90 శాతం పైప్‌లైన్ నిర్మాణం పనులు పూర్తి కాగా ఈ నెల 13 లోపు మిగతా పనులను సైతం పూర్తి చేయానికి పనులను యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. జిరాయత్‌నగర్, టీచర్స్ కాలనీ, రాజుల గుట్టలో నిర్మించాల్సిన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుల నిర్మాణం సైతం పూర్తయ్యాయి. ఆర్మూర్ పట్టణంలో 9,997 ఇళ్లకు నల్లా కనెక్షన్‌లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు ఎనిమిది వేలకు పైగా నల్లా కనెక్షన్‌లను బిగించారు.
13న ట్రయల్ రన్
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టిన పథకాన్ని ప్రారంభిస్తుండడంతో ఈ నెల 13వ తేదీన ట్రయల్ రన్ నిర్వంహించి లీకేజీలు, చిన్న పాటి మరమ్మతులు ఉంటే పూర్తి చేయడానికి అధికారులు నిర్ణయించినట్లు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ట్రయల్ రన్ విజయంతం కాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా తాగునీటి పథకాన్ని ప్రారంభించనున్నారు. దీంతో ఆర్మూర్ పట్టణ ప్రజల చిరకాల వాంచ అయిన తాగునీటి సమస్య పరిష్కారం కానుంది.