ముఖ్యమంత్రి కళ్లజోడు మిస్సింగ్
హన్మకొండ: వరంగల్ జిల్లాలో మూడు రోజులుగా అభివృద్ధిపై సమీక్షలు నిర్వహించిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కళ్లజోడు మంగళవారం మాయమైంది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు నానా హైరానా పడ్డారు. చివరకు బుధవారం కళ్లజోడు దొరకడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
వివరాల్లోకి వెళితే... మంగళవారం రాత్రి నక్కలగుట్టలోని నందనా గార్డెన్‌లో కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. అనంతరం కెప్టెన్ లక్ష్మికాంతరావు ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి తన కళ్లద్దాల కోసం వాకబు చేశారు. భద్రతా అధికారులు ఆరా తీస్తే నందనా గార్డెన్‌లోనే వదిలి వెళ్లినట్లు తెలిసింది. దీంతో అధికారులు నందనా గార్డెన్‌లోని చెత్తడబ్బాలను వెతికారు. రాత్రి 11.30 వరకు వెదికినా ఫలితం లేదు. అయితే సహజంగా సీట్లోంచి సీఎం లేవగానే అక్కడున్న నాప్‌కిన్‌లు, ఇతర వస్తువులను సెక్యూరిటీ సిబ్బంది, లేదా అటెండర్ తీసుకెళ్లతారు. వాటిలో న్యాప్‌కిన్‌లు, ఇతర వస్తువులు తీసుకెవెళ్లినా... కళ్లద్దాలు వదిలి వేయడం ఏంటని నాయకులు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా మంగళవారం మాయమైన సీఎం కళ్లజోడు బుధవారం సాయంత్రం దొరికినట్లు అధికారులు చెపుతున్నారు. అయితే, ఎక్కడ దొరికిందనే విషయం మాత్రం చెప్పడం లేదు.