పంట కోతకు నేనూ వస్తా! | CM kcr visit's he's adopted village erravalli , narsannapeta | Sakshi
Sakshi News home page

పంట కోతకు నేనూ వస్తా!

Published Thu, Sep 29 2016 3:17 AM | Last Updated on Mon, Oct 8 2018 9:00 PM

బుధవారం ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామస్తుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కె.చంద్రశేఖర్‌రావు. - Sakshi

బుధవారం ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామస్తుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కె.చంద్రశేఖర్‌రావు.

ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామస్తులతో సీఎం కేసీఆర్
ఊరు ఊరంతా సైన్యంలా కదలాలి.. పంట కోతలు ఏకకాలంలో చేపట్టాలే
వచ్చే ఏడాదికి మూడు పంటలు తీయాలి.. 12 ఏళ్ల దాకా కరువుండదు
మల్లన్నసాగర్ పంచాయితీ తెగింది.. రిజర్వాయర్  రెండేళ్లలో పూర్తి చేస్తాం

 సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘‘ప్రభుత్వం మీ వెంట ఉంది. తెలంగాణలో తొలి ఫలాలను అందుకోబోతున్నారు. అందరికీ ఆదర్శంగా నిలవాలె. రాష్ట్రానికి మార్గం జూపాలె. ఊరు.. ఊరంతా సైన్యంలా కదిలి మొక్కజొన్న, సోయాబీన్  పంట కోత పనులు ఏకకాలంలో చేపట్టాలె. చేను కోతలో నేను కూడా పాల్గొని పంట కోస్తా..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మెదక్ జిల్లా ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామస్తులతో అన్నారు. ప్రజలంతా కలసి సంఘటిత శక్తిని చాటాలని పిలుపునిచ్చారు. ‘‘పంట కోత పని పూర్తి కాగానే వెంటనే రబీ విత్తనాలు వేద్దాం. మల్లసారి ఏడాదికి మూడు పంటలు తీసే స్థితికి మనం రావాలి. అంతా కలిసి మెలిసి ఉందాం.

కలిసి ఊరు, సాగు పనులు చేసుకుందాం’’ అని చెప్పారు. గతంలో సిద్దిపేట ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో చిన్నకోడూరు మండలం సలేంద్రి గ్రామంలో తన ఆధ్వర్యంలో గ్రామస్తులంతా కలసి వరికోత పనులు పూర్తి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. బుధవారం ఎరవ్రల్లిలో కొత్తగా నిర్మించిన ఫంక్షన్ హాల్‌లో తన దత్తత గ్రామాలైన ఎరవ్రల్లి, నర్సన్నపేట గ్రామాల ప్రజలతో సీఎం సమావేశమయ్యారు. మల్లన్నసాగర్ పంచాయితీ ఇక తెగిపోరుుందని, మరో రెండేళ్లలో రిజర్వాయర్‌ను పూర్తిచేసి గోదావరి జలాలను అందిస్తామని చెప్పారు.

365 రోజుల పాటు ఇక్కడికి గోదావరి జలాలు తెచ్చి ఎప్పడూ పచ్చని కాంతులు ఉండేలా చూస్తానని హామీ ఇచ్చారు. ‘‘ఈ ఏడాది వరదలొస్తయని నేను ముందే జెప్పిన. అన్నట్లే వచ్చినయ్. నీళ్లు నిలబడ్డయ్. ఇంతకుముందు చేబర్తి చెరువు మత్తడి దుంకి కూడవెళ్లిలో పడి గోదాట్లో కలిసేది. ఇప్పుడు మనం ఎక్కడికక్కడ నీళ్లు నింపుకుంటున్నం. దేశానికి పట్టిన 20 ఏండ్ల ఎల్‌నినో పీడ విరగడైంది. వచ్చేదంతా లానినో హవానే. 12 ఏండ్ల పాటు కరువు ఉండదు’’ అని పేర్కొన్నారు.

సాగు లేనివారికి  గేదెలు, కోళ్లు
వ్యవసాయం లేనివారికి పాడి గేదెలు, ఊరు కోళ్లు కొనుగోలు చేసి ఇప్పిస్తామని గ్రామస్తులకు సీఎం హామీనిచ్చారు. ‘‘నచ్చిన గేదెలను చూసుకుని బయానా ఇచ్చి వస్తే జేసీ వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తాం. పశువుల గడ్డి కోసం విత్తనాలను అధికారులు సరఫరా చేస్తారు. ఈ అవకాశాన్ని వెంటనే ఉపయోగించుకోండి. గ్రామాల్లో అప శబ్దాలు వద్దు. పంచాయితీలు, గొడవలకు ఇకపై స్వస్తి పలుకుదాం.

మనల్ని జూసి ఇతర గ్రామాల ప్రజలు నేర్సుకోవాలె.. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామంలో ఉండే చిన్నరాజన్నకు వచ్చిన ఆలోచన నేడు ఆ గ్రామాన్ని ఒక్కతాటిపై నడిపిస్తంది. వారివి మనకంటే మంచి భూములేం కావు. వ్యవసాయం చేస్తూ దర్జాగా బతుకుతుండ్రు. బ్యాంకుల్లో కోట్ల రూపాయల డిపాజిట్లున్నారుు. అక్కడ ఇండ్లలో మహిళలదే ఆర్థిక పెత్తనం. అభివృద్ధికి ఇది కూడా ఓ కారణం. రష్యాలో 90 శాతం విమానాలను మహిళలే నడిపిస్తరు. వారికి అవకాశమిస్తే ఏదైనా చేయగలరు. ఇందిరాగాంధీ ప్రధానిగా మెప్పించారు’’ అని మహిళా శక్తిని సీఎం కొనియాడారు.

అన్ని సౌకర్యాల తర్వాతే ఇళ్లలోకి వెళ్దాం
‘‘మన రెండు గ్రామాల చుట్టూ 4 చెరువులు, కుంటలున్నయ్. అవి పూర్తిగా నిండినయ్. ఇంకా రెండు గ్రామాల్లో 70కి పైగా బోర్లేసుకుందాం. ‘గడా’ నుంచి కానీ, ఎమ్మె ల్యే అభివృద్ధి నిధి నుంచి గానీ నిధులు మంజూరు జేస్తా. వెంటనే బోర్లు వేసి కనెక్షన్లు ఇప్పించండి’’ అని రెండు గ్రామాలకు ప్రత్యేకాధికారిగా ఉన్న జేసీ వెంకట్రామిరెడ్డిని సీఎం ఆదేశించారు. ‘‘నీటిని బోర్ల ద్వారా నేరుగా వాడాలా? లేక సంపులు నిర్మించాలా? అనే విషయాన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్‌రావు నిర్ణరుుస్తారు’’ అని చెప్పారు.

‘‘డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం కొంత ఆలస్యం జరిగింది. అరుునా సరే ఇండ్లపై ట్యాంకులు నిర్మించి నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేసుకుని పూర్తిస్థారుు సౌకర్యాలు సమకూరిన తర్వాతే ఇండ్లలోకి వెళ్దాం. పెద్ద పండగ చేసుకుందాం. పండుగకు నేను కూడా వస్తా’’ అని చెప్పారు. ఎరవ్రల్లిలో మాదిరే నర్సన్నపేటలో కూడా ఫంక్షన్‌హాల్‌ను నిర్మించుకుందామన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ రోనాల్డ్ రోస్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, గడా ఓఎస్డీ హనుమంతరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement