ఇంత ‘చెత్త‘గా చేస్తారా?
విజయవాడ సెంట్రల్ :
నగరంలో పారిశుధ్యం చాలా అధ్వాన్నంగా ఉంది. ఇలా అయితే కష్టం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ ప్రజాప్రతినిధులు, అధికారులకు క్లాస్ తీసినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. శుక్రవారం రాత్రి చంద్రబాబు ఘాట్ల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మార్గమధ్యంలో రోడ్లపై దుమ్ముదూళి పేరుకుపోయి ఉండటం, డీసిల్టింగ్‌పనులు చేసినట్లు కనిపించకపోవడంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పారిశుధ్యానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం, ఆశించిన స్థాయిలో ఎందుకు మెరుగుపర్చడం లేదని అధికారుల్ని నిలదీసినట్లు భోగట్టా. నగరపాలక సంస్థ అధికారులు, కార్పొరేటర్లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పారిశుధ్య పరిస్థితుల్ని చక్కదిద్దాల్సిందిగా ఎంపీ కేశినేని నాని ని ఆదేశించారు. అందుకే ఆయన దీంతో హడావుడిగా కౌన్సిల్ హాల్లో సమావేశం ఏర్పాటు చేశారని తెలుస్తోంది.
నైపుణ్యం లేని కార్మికులు
నగరపాలక సంస్థలో అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం లేకపోవడంతో పాలన గాడితప్పింది. పుష్కర పనులు ముగింపు దశకు చేరుకున్నాక కానీ కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేయలేదంటే పరిస్ధితి ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏ మాత్రం అనుభం లేని కాంట్రాక్టర్లకు పారిశుధ్య పనుల్ని అధికారులు కట్టబెట్టారు. వారు గ్రామీణ ప్రాంతాల నుంచి వ్యవసాయ కూలీలను పనులకు తీసుకువస్తున్నారు. గడ్డి పీకడం, పిచ్చి మొక్కలు తొలగించడం, రోడ్లు ఊడ్చడం వంటి పనుల్ని మాత్రమే తాము చేస్తామని, కాల్వల్లో సిల్టు తీయలేమని కూలీలు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం, సకాలంలో జీతాలు చెల్లించకపోవడం వంటి కారణాలతో ఆశించిన స్థాయిలో పారిశుధ్య పనులు జరగడం లేదనేది బహిరంగ రహస్యం. వెహికల్ డిపో పనితీరు అధ్వాన్నంగా ఉందని స్వయంగా మేయర్ కోనేరు శ్రీధర్ మొత్తుకుంటున్నా అధికారులు వినిపించుకొనే స్థితిలో లేరు. నగరపాలక సంస్థలో 3,400 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తుండగా నెల రోజుల క్రితం అదనంగా 1,100 మందిని తీసుకున్నారు. దీనివల్ల ఖర్చు పెరిగింది తప్ప, ఏమాత్రం ప్రయోజం లేకుండా పోయింది. 18 వేల మంది కార్మికుల్ని పుష్కర విధులకు ఎంపిక చేసిన అధికారులు వారితో ఎలా పనిచేయిస్తారన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.