దుబార ఖర్చు చేస్తున్న సీఎం కేసీఆర్
దుబార ఖర్చు చేస్తున్న సీఎం కేసీఆర్
Published Sat, Jul 23 2016 9:03 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
నిజామాబాద్ సిటీ : ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు ఆర్థిక క్రమశిక్షణ లేదని పీసీసీ అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శి బొమ్మ మహేశ్ కుమార్‌గౌడ్ విమర్శించారు. రాష్ట్రంలో అవసరం లేని చోట ప్రాజెక్టుల నిర్మాణం, వాస్తు పేరిట ఉన్నవాటిని కూల్చి కొత్త నిర్మాణాలు చేపట్టడం ప్రజల సొమ్మును దుబార చేయడమే నన్నారు. శనివారం నిజామాబాద్‌లోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చక్కని సీఎం క్యాంపు కార్యాలయం నిర్మించారని, ఏ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చినా అన్ని విధాల ఉపయోగపడేలా క్యాంపు కార్యాలయం నిర్మిస్తే దానికి వాస్తు లేదని కూల్చివేసి రూ. 33 కోట్లతో కొత్త క్యాంపు కార్యాలయం నిర్మించేయత్నంలో కేసీఆర్ ఉన్నారని విమర్శించారు. రూ. ఒక లక్ష 60 వేల కోట్లు అప్పులున్న ఈ రాష్ట్రంలో ఇంత దుబార ఖర్చు అవసరమా అని ప్రశ్నించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో నీటి నిపుణులు 1.5 టీఎంసీలకు నిర్దేశిస్తే, సీఎం ఏకంగా 30 నుంచి 40 టీఎంసీలకు వెళ్లి మల్లన్నసాగర్‌ను నిర్మాణం చేస్తున్నారంటే దాని వెనుక మతలబు ఏమిటో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇదంతా డబ్బులు దండుకోడానికేనని అన్నారు. కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు అవసరమే లేదని ఆరునెలల పాటు లిఫ్టు ద్వారా పంటలకు ఇవ్వవచ్చన్నారు. అక్కడక్కడ చిన్న ప్రాజెక్టులు కట్టుకోవచ్చన్నారు.
Advertisement