కొబ్బరి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు కృషి
కొబ్బరి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు కృషి
Published Wed, Feb 8 2017 11:33 PM | Last Updated on Tue, Sep 5 2017 3:14 AM
నాఫెడ్ కేంద్రాలు నిరంతరం కొనసాగేలా చర్యలు
హోంశాఖామంత్రి చినరాజప్ప
అంబాజీపేట : కొబ్బరి విస్తారంగా సాగవుతున్న కోనసీమలో కొబ్బరి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. బుధవారం అంబాజీపేటలో పర్యటించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. నాఫెడ్ కొనుగోలు కేంద్రాలు నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకొంటామన్నారు. కొబ్బరి ఆధారిత పరిశ్రమల ఏర్పాటులో భాగంగా సీపీసీఆర్‌ఐ డైరెక్టర్ డాక్టర్ పి.చౌడప్ప ఇటీవల కోనసీమలో పర్యటించారన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని అల్లవరం మండలం సామంతకుర్రులో గుర్తించారని తెలిపారు. ఆ స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించే చర్యలు తీసుకొంటున్నామన్నారు. కడియం మండలం మాధవరాయుడుపాలెంలో సీపీసీఆర్‌ఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కోసం ఇప్పటికే భూసేకరణ పూర్తయిందన్నారు.
ప్రారంభోత్సవాలు
అంబాజీపేటలో రూ.18 లక్షలతో నిర్మించిన సొసైటీ గోదాములను హోం మంత్రి చినరాజప్ప బుధవారం ప్రారంభించారు. తొలుత అంబాజీపేట శివారు కొర్లపాటివారిపాలెంలో రూ.20 లక్షలతో నిర్మించిన సామాజిక కమ్యూనిటీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న «వివిధ సామాజిక వర్గాల కమ్యూనిటీ భవనాలను దశలవారీగా పూర్తిచేస్తామన్నారు. అనంతరం స్థానిక వెంకట్రాజు ఆయిల్ మిల్లు వద్ద ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొబ్బరి ఒలుపు యంత్రం (డీ హస్కర్)ను మంత్రి రాజప్ప ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పి.గన్నవరం, అమలాపురం ఎమ్మెల్యేలు పులపర్తి నారాయణమూర్తి, అయితాబత్తుల ఆనందరావు, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఆర్డీవో జి.గణేష్‌కుమార్, ఏడీహెచ్ శ్రీనివాస్, ఎంపీపీ దాసరి వీరవెంకట సత్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యుడు బొంతు పెదబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ అరిగెల బలరామమూర్తి, సొసైటీ అధ్యక్షుడు గణపతి వీరరాఘవులు, సర్పంచ్‌లు సుంకర సత్యవేణి, కాండ్రేగుల గోపాలకృష్ణ, మట్టపర్తి చంద్రశేఖర్, ఎంపీటీసీలు ఈతకోట సత్యవతి, దొమ్మేటి సాయికృష్ణ, కత్తుల నాగమణి, కోమలి అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Advertisement