ఎఫ్‌పీవోలుగా ఏర్పడితేనే సాగు లాభసాటి
-
ఉద్యానవన శాఖ సంయుక్త సంచాలకుడు శ్రీనివాసులు
-
కొబ్బరి రైతులకు అవగాహన సదస్సు
అమలాపురం/ అంబాజీపేట :
‘ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌పీవో)లుగా ఏర్పడితేనే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. అన్ని వాణిజ్య పంటల రైతులు తమ పంటల వారీగా ఎఫ్‌పీవోలుగా ఏర్పడాలని ఉద్యానవన శాఖ సంయుక్త సంచాలకుడు సీహెచ్ శ్రీనివాసులు అన్నారు. అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారంలోని భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) జిల్లా అధ్యక్షుడు దొంగ నాగేశ్వరరావు ఇంటి వద్ద కొబ్బరి రైతులకు ఎఫ్‌పీవోలపై అవగాహన సదస్సు జరిగింది. కోనసీమ నలుమూలల నుంచి కొబ్బరి రైతులు హాజరయ్యారు. వినియోగదారుడు కొనుగోలు చేసే ధరలో ప్రస్తుతం రైతులకు కేవలం 25 శాతం మాత్రమే ధర లభిస్తుందని, దీనిని కనీసం 65 శాతం వరకు పెంచేలా ప్రభుత్వం ఎఫ్‌పీవోలకు శ్రీకారం చుట్టిందన్నారు. ఎఫ్‌పీవోలను, కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందాలు చేయడం ద్వారా రైతుల ఉత్పత్తులను కంపెనీలు నేరుగా కొనుగోలు చేసే అవకాశముందని, దీని వల్ల రైతులకు లాభసాటి ధర వస్తుందని శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యాన శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడంతో పాటు రూ.కోట్లతో రైతులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని ఆయన తెలిపారు. కొబ్బరి రైతులు సైతం పెప్సీకో వంటి కంపెనీలతో ఒప్పందాలు చేసుకునే అవకాశముందని, కోనసీమలోని సుమారు 10 లక్షల కురిడీ కొబ్బరికాయల నిల్వ చేసుకునే స్థాయిలో ప్యాక్‌హౌస్‌లను సైతం రైతులు నిర్మించుకునే అవకాశముందని ఆయన చెప్పారు. ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేసుకునే విధివిధానాలపై వృత్తి స్వచ్ఛంద సంస్థకు చెందిన నరేంద్రనాథ మాట్లాడుతూ ములకనూరు రైతు సహకార సొసైటీ సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుని రైతులు ఎఫ్‌పీవోలుగా ఏర్పడాలన్నారు. గ్రామస్థాయిలోను, డివిజన్ స్థాయిలో వీటిని ఏర్పాటు చేసుకోవాలని, ఒక పాలకవర్గాన్ని సైతం ఎన్నుకోవాలని సూచించారు. ఎఫ్‌పీవోలకు నాబార్డు, ప్రభుత్వం నుంచి రాయితీలు, ప్రోత్సహకాలందుతాయన్నారు. కేరళలో కొబ్బరి అభివృద్ధి వెనుక ఈ సంఘాల కృషి ఉందని ఆయన వివరించారు. హైదరాబాద్‌కు చెందిన ట్రేడర్ లక్ష్మీనారాయణ, బీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల జమ్మి, బలరామ్ కోకోనట్ ఫెడరేషన్ చైర్మన్ ఉప్పుగంటి భాస్కరరావు, రైతులు పెదమల్లు నాగబాబు, డీసీసీబీ డైరెక్టర్ జవ్వాది బుజ్జిలు పాల్గొన్నారు.