కొబ్బరి ‘ధర’హాసం
కొబ్బరి ‘ధర’హాసం
Published Sun, Jun 18 2017 11:22 PM | Last Updated on Tue, Sep 5 2017 1:56 PM
వెయ్యి పచ్చికాయల ధర రూ.8,200
మరింత పెరిగే అవకాశం
తగ్గిన దిగుబడి..పెరిగిన ఎగుమతులు
అమలాపురం/ అంబాజీపేట (పి.గన్నవరం) : దిగుబడి తగ్గడం...శ్రావణమాస నిల్వ పోతలు ఆరంభం కావడంతో కొబ్బరికాయ ధర అనూహ్యంగా పెరిగింది. వారం రోజుల వ్యవధిలో వెయ్యికాయల ధర రూ.6,500ల నుంచి రూ.8,200కు చేరింది. పచ్చికాయతోపాటు ముక్కుడు కాయ ధర కూడా పెరగడం సహజంగా రైతులకు సంతోషాన్ని నింపాలి. కానీ ఇదే సమయంలో వేసవి ఎండల కారణంగా పిందెలు రాలి.. దిగుబడి తగ్గడం వల్ల పెరిగిన ధర రైతులకు పెద్దగా ఊరటనివ్వడం లేదు.
రాష్ట్రంలో కొబ్బరి వ్యాపార కేంద్రమైన అంబాజీపేట మార్కెట్‌లో పచ్చికాయ కొబ్బరి ధర గడిచిన వారం రోజులుగా పెరుగుతూ వస్తోంది. తాజాగా పచ్చికాయ వెయ్యికాయల ధర రూ.8,200ల వరకు పెరుగుతోంది. గోదావరి లంకకాయ ధర రూ.8,500లు పలుకుతోంది. గడిచిన మూడు, నాలుగు నెలలుగా రూ.6 వేల నుంచి 7 వేల మధ్యలో మాత్రమే ధర ఉండగా, ఆషాడంలో ఉత్తరాది వారు ప్రత్యేకంగా చేసే పూజలకు కొబ్బరికాయను ఎక్కువుగా వినియోగించడం, ఇతర రాష్ట్ర వ్యాపారులు శ్రావణ మాస నిల్వలకు సిద్ధం కావడంతో పచ్చికాయ ధర అంచనాలకు మించి పెరిగింది. వ్యాపార సరళి చూస్తుంటే ధర మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రధానంగా గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్ రాష్ట్రాల వ్యాపారులు శ్రావణమాసాన్ని దృష్టిలో పెట్టుకుని నిల్వపోతలు చేస్తున్న కారణంగానే పచ్చికాయ ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. దీనికితోడు వచ్చే నెలలో తెలంగాణాలో బోనాలు పండుగ జరగనున్నందున హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు ఎగుమతులు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. వారం రోజుల క్రితం వరకు కోనసీమ నుంచి రోజుకు 15 నుంచి 20 లారీల వరకు పచ్చికాయ ఎగుమతి అయ్యే పచ్చికొబ్బరికాయలు ఇప్పుడు 40 నుంచి 50 లారీల వరకు ఎగుమతి పెరిగింది. నిన్నటి మొన్నటి వరకు పచ్చికాయ ధరతో సమానంగా ఉన్న ముక్కుడు కాయ (నెల రోజుల నిల్వ ఉన్న కాయల) ధర ఆశించిన స్థాయిలో పెరిగలేదు. రూ.6,500లు ఉన్న ముక్కుడు కాయల ధర ప్రస్తుతం రూ.7,500 మాత్రమే పెరిగింది. ఇదే సమయంలో దక్షిణాదిలో కొబ్బరిలో ద్వితీయ స్థానంలో ఉన్న తమిళనాడులో సైతం కొబ్బరి దిగుబడి తగ్గడం మన కొబ్బరికి ధర రావడం మరో కారణమైంది.
అంబాజీపేట మార్కెట్‌లో పెరిగిన ఈ ధరలు మార్కెట్‌లో ఉత్సహభరిత వాతావారణాన్ని నింపింది. కాని రైతులకు మాత్రం పెరిగిన ధర పెద్దగా ఆనందాన్ని ఇవ్వడం లేదు. వేసవి సీజన్‌లో ఎకరాకు కొబ్బరి కాయల దిగుబడి ఎకరాకు 1,200లు కాగా, ప్రస్తుతం ఎకరాకు 600ల నుంచి 800 దిగుబడిగా వస్తోంది. వేసవిలో పది రోజులకు పైబడి 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతల కారణంగా సైజులో ఉన్న పిందెలు, కాయలు రాలిపోవడం వల్ల దిగుబడి ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. పైగా పశ్చిమ గోదావరి జిల్లాతోపాటు ఈసారి మన జిల్లా నుంచి సైతం పెద్ద ఎత్తున బొండాలు రవాణా జరగడం వల్ల కూడా దిగుబడి తగ్గింది. ముందు, ముందు ఈ ప్రభావం ఎక్కువుగా ఉండే అవకాశంతోపాటు శ్రావణ నిల్వపోతలు పెరిగితే ధర మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్న రైతులు ఆచితూచి అమ్మకాలు చేస్తున్నారు.
Advertisement
Advertisement