
చలితో గజగజ..!
• రోజురోజుకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలు
• చలిగాలులతో వణుకుతున్న ప్రజలు
• పొంచి ఉన్నఅనారోగ్య ముప్పు
మహబూబ్‌నగర్ క్రైం : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా లో కనిష్ట ఉష్ణోగ్రతలు అతి తక్కువస్థాయికి పడిపోతున్నాయి. పదిరోజుల నుంచి చలి పెరిగుతోంది. గ్రామీణ ప్రాంతంలో ప్రజల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిం ది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రోజురోజుకు వాతావరణంలో భారీ మార్పులతో కనిష్టస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలిపులి పంజా విసురుతోంది. సాయంత్రం ఐదు దాటిందంటే చల్లనిగాలులు వీస్తున్నాయి. తెల్లవారుజామున నుంచి చల్లని గాలులతో పాటు మంచు కప్పుకుంటోంది. పదేళ్ల కాలంలో ఎప్పుడూ నమోదుకాని విధంగాలో ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో ఈసారి ఉదయం 8గంటలు గడవనిదే ఏపని చేసుకోలేని పరిస్థితి. మరోవైపు పిల్లల నుంచి పెద్దల వరకు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. చలిజ్వరాలతో పాటు ఇతరత్ర వ్యాధులతో సతమతమవుతున్నారు.
రాత్రివేళల్లో..
జిల్లాలో వారం రోజులుగా రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయాయి. చలి తీవ్రత పెరిగింది. వాతావరణంలో వచ్చిన ఆకస్మిక మార్పులతో జలుబు, దగ్గు తదితర సమస్యలతో ఆనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది. చలిని తట్టుకోలేక వృద్ధులు ఇబ్బందిపడే అవకాశం ఎక్కువగా ఉంది. చలికాలంలో రుగ్మతలు ధరిచేరకుండా పరిశుభ్రతతో పాటు ఆహారపు అలవాట్లలో స్వల్ప మార్పులు చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే శరీరాన్ని కాపాడుకోవచ్చు.