కాంట్రాక్టర్‌ను జైలులో పెట్టండి..
కాంట్రాక్టర్‌ను జైలులో పెట్టండి..
Published Sun, Aug 14 2016 12:20 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
వన్‌టౌన్ :
కృష్ణా పుష్కరాల సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన మరుగుదొడ్ల నిర్వహణపై జిల్లా కలెక్టర్ బాబు.ఏ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ తీసుకున్న కాంట్రాక్టర్‌ను జైలులో పెట్టాలంటూ పోలీసు అధికారులను ఆదేశించారు. పిచ్చిపిచ్చి వేషాలు వేసి డబ్బులు కాజేయాలని చూస్తే ఊరుకుంటామనుకుంటున్నారా...అంటూ తీవ్రంగా హెచ్చరించారు. పుష్కరాల సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మరుగుదొడ్లు ఏర్పాటు, నిర్వహణకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. అందులో భాగంగా 1800 మరుగుదొడ్ల ఏర్పాటుకు పూనేకు చెందిన లాల్‌జీ అనే కాంట్రాక్టర్ రూ.రెండు కోట్లకు కాంట్రాక్ట్ పొందాడు. నగరంలో వివిధ ప్రాంతాల్లో మరుగుదొడ్ల ఏర్పాటు, సిబ్బంది కేటాయింపు, నిర్వహణ వారే చూడాలి. ఆ సంస్థ మరుగుదొడ్ల నిర్వహణలో పూర్తిగా విఫలం చెందింది. దానిపై కార్పొరేషన్ అధికారులు మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్‌కు వివరించారు. ఆయన స్వయంగా పరిశీలించి విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. శనివారం జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, జాయింట్ కలెక్టర్ చంద్రుడు, సబ్‌కలెక్టర్ సృజన, ఇతర అధికారులు దుర్గాఘాట్ వద్ద కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సమావేశమయ్యారు. కమిషనర్ కాంట్రాక్టర్‌ను పిలిపించి జిల్లా కలెక్టర్ ముందు నిలబెట్టాడు. కలెక్టర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పని చేయకుండా డబ్బులో కాజేయాలని చూస్తున్నారా..? అంటూ ప్రశ్నించారు. అటువంటి ట్రిక్‌లు ఎక్కడైనా జరుగుతాయోమో.. ఈ జిల్లాలో జరగదంటూ మండిపడ్డారు. పక్కనే ఉన్న డీఎస్పీని కార్పొరేషన్ వారు ఫిర్యాదు చేస్తారని, కాంట్రాక్టర్‌ను అరెస్ట్ చేయాలంటూ సూచించారు.
Advertisement