డెంగీ నివారణకు చర్యలు తీసుకోండి
-
పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
-
ఈవోపీఆర్‌డీకి ఇంక్రిమెంట్ కట్..
-
ఎంపీడీవో, ఐదుగురు కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు
-
వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఆదేశం
మచిలీపట్నం (చిలకలపూడి) : జిల్లాలో డెంగీ వ్యాధి నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని, అలసత్వం వహిస్తే చర్యలుతీసుకుంటానని కలెక్టర్ బాబు.ఎ చెప్పారు. కలెక్టరేట్ నుంచి మండల అధికారులతో సోమవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గత వారం వీడియోకాన్ఫరెన్స్‌లో డెంగీ నివారణకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహించటంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లాలో 122 డెంగీ కేసులు, 411 మలేరియా కేసులు నమోదయ్యాయని తెలిపారు. విజయవాడ నగరంలోనే 31 డెంగీ కేసులు, 370 మలేరియా కేసులు నమోదు కావటంపై కార్పొరేషన్ అధికారులపై కలెక్టర్ మండిపడ్డారు. చాట్రాయి మండలంలో డెంగీ, మలేరియా వ్యాధుల నివారణకు ఎటువంటి యాక్షన్ ప్లాన్ చేపట్టలేదని ఎంపీడీవోపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈవోపీఆర్‌డీ ఇంక్రిమెంట్ తొలగించాలని ఆదేశాలు జారీచేశారు. ఎంపీడీవోతో పాటు ఐదుగురు పంచాయతీ కార్యదర్శులకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డీపీవోను ఆదేశించారు. ప్రతి మండలంలో ఎంపీడీవో, తహసీల్దార్, ప్రత్యేకాధికారులు సమన్వయంతో పారిశుద్ధ్యంపై ప్రత్యేకప్రణాళికను తయారుచేసి తనకు పంపాలన్నారు. ఎటువంటి చర్యలు తీసుకున్నారో వాటి ఫొటోలు సహా సమాచారం ప్రతి రోజు అందించాలన్నారు. జిల్లాలో ఒక్క హెక్టారు కూడా నీరు లేక పంట ఎండిపోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం వ్యవసాయ శాఖ, ప్రజాసాధికారిత సర్వే తదితర అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డీఆర్వో సీహెచ్ రంగయ్య, డీఎంఅండ్‌హెచ్‌వో ఆర్.నాగమల్లేశ్వరి, వ్యవసాయ శాఖ జేడీ నరసింహారావు, వి.శరత్‌బాబు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మత్స్యశాఖ అధికారులపై కలెక్టర్
కలెక్టర్ బాబు.ఎ సోమవారం తన చాంబర్‌లో మత్స్యశాఖ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. చేపల చెరువుల తవ్వకాల కోసం వెయ్యి మంది దరఖాస్తులు చేసుకున్నారని, అయితే కేవలం 128 మందికి అనుమతులు ఇవ్వాలని సమావేశం దృష్టికి తీసుకురావటం ఏమిటని అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దరఖాస్తులు ఎక్కడ పెండింగ్ ఉన్నాయో చెప్పాలని మత్స్యశాఖ ఇన్‌చార్జ్ డీడీ నరసింహారావును ప్రశ్నించారు. కలిదిండి, ముదినేపల్లి మండలాల్లో ఎక్కువగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని డీడీ వివరించారు. దీంతో ఆయన దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్న సంబంధిత అధికారులను సస్పెండ్ చేస్తూ సిఫార్సు చేయాలని చెప్పారు. ఆఖరి అవకాశం ఇస్తున్నానని, ఇకపై విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ల పరంపర కొనసాగుతుందని హెచ్చరించారు. గతంలో తాను కలెక్టర్‌గా పనిచేసిన చోట ఒకే రోజు ఎక్కువ మంది సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు చెప్పారు. చేపల చెరువుల తవ్వకాలకు అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు డివిజన్ల వారీ టీమ్‌లుగా ఏర్పడి త్వరితగతిన పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. దరఖాస్తులు పెండింగ్ ఉన్న సంబంధిత తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డీఆర్వో సీహెచ్ రంగయ్యను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు గొరిపర్తి నరసింహరాజుయాదవ్, పర్యావరణశాఖ అధికారి సత్యనారాయణ పాల్గొన్నారు.