కొండ కోనల్లో కలెక్టర్ పర్యటన
కొండ కోనల్లో కలెక్టర్ పర్యటన
Published Sat, May 13 2017 10:58 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
24 కిలో మీటర్ల మేర కొండ, రాళ్ల మార్గంలో కాలి నడకన పయనం
ఆపసోపాలు పడ్డ అధికార యంత్రాంగం
మారేడుమిల్లి : చుట్టూ దట్టమైన అడవి, అడుగడుగునా రాళ్లు, మధ్యలో కొండ కాలువలు, రెండు కొండలు ఎక్కి దిగుతూ కాలినడకన మాత్రమే ఆ గ్రామానికి చేరుకోవాలి. అక్కడకు వెళ్లి రావాలంటే నరయాతన తప్పదు. అదే మారేడుమిల్లి మండలం జీఎం వలస పంచాయతీ పరిధిలోని ఇజ్జలూరు గ్రామం. అక్కడ 12 కుటుంబాలు, 10 గృహాలు, 30 మంది జనాభా ఉంటారు. మారేడుమిల్లి నుంచి భద్రాచలం వెళ్లే దారిలో ఘాట్ రోడ్డు దగ్గర నుంచి అటవీ మార్గం గుండా 12 కిలో మీటర్లు వెళితే ఈ గ్రామం వస్తుంది. ఇలాంటి గ్రామాన్ని కలెక్టర్ కార్తికేయ మిశ్రా శనివారం సందర్శించారు. అక్కడి గిరిజనులు పడుతున్న బాధలు తెలుసుకోవడానికి ఆయన కాలినడకన చేరుకున్నారు. గత కలెక్టర్లకు భిన్నంగా మిశ్రా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గ్రామాల అభివృద్ధిపై ఆయన దృష్టి సారించారు. దట్టమైన అటవీ మార్గంలో 24 కిలోమీటర్లు కాలినడకన అతి కష్టం మీద మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ నడిచి వెళ్లారు. ఇంతవరకు ఏ కలెక్టర్ చేయని సాహసం ఆయన చేశారు. అయితే కలెక్టర్ వెంట బయలుదేరిన అధికార బృందం నానా అవస్థలు పడింది.
గిరిజనులతో ముఖాముఖి
మారుమూల లోతట్లు గ్రామాల్లో విద్య, వైద్య మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు. ఇజ్జలూరు గ్రామంలో పర్యటించిన కలెక్టర్ అక్కడి గిరిజనులతో ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ నివసిస్తున్న పది కుటుంబాలు రోడ్డు పాయింట్‌కు వస్తే అన్ని వసతులతో గృహాలు నిర్వహించి ఉపాధి కల్పిస్తామని అన్నారు. అయితే తమ గ్రామాన్ని విడిచి రావడానికి వారు నిరాకరించారు. గ్రామంలో పిల్లల చదువుకోసం స్కూల్, మినీ అంగన్‌వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గ్రామానికి చెందిన నాగేశ్వర రెడ్డి, స్కూల్ టీచర్‌గా, రమణమ్మను ఆయాగా నియమించారు. అధికారులతో సర్వేచేసి సోలార్ సిస్టమ్ ద్వారా ఆయకట్టు విస్తీర్ణాన్ని పెంచేందుకు యోచన చేస్తామని అన్నారు. అటవీ అభ్యంతరాలు పరిష్కరిస్తూ రహదారి నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. గ్రామంలో డ్వాక్రా గ్రూపును టీపీఎంఎం ద్వారా పునరుద్ధరించి ఒక్కొక్క సభ్యురాలికి రూ.15 వేల రుణం అందిస్తామన్నారు. ఈ నిధులను ఆదాయ వనరుల పెట్టుబడి పెట్టుకుని జీవనోపాధి పెంపొందించుకోవాలని సూచించారు. ఒక ఆశ వర్కర్‌ను స్థానికంగా నియమిస్తామన్నారు.గ్రామంలో ఏఏ పంటలు సాగుచేస్తారని ఆయన ఆరా తీశారు. అనంతరం వాటర్ ఫిల్టర్‌ను గిరిజనులకు కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో పీవో దినేష్‌కుమార్, ఏఎస్పీ నయీంఅస్మీ, డీఎఫ్‌వో నందిని, సబ్ డీఎఫ్‌వో శ్యాముల్, ఎంపీడీవో సూర్యానారాయణ, ఎంపీపీ కుండ్ల సీతామహాలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు సత్తి సత్యనారాయణ రెడ్డి, ఈఈ నాగేశ్వరరావు, డీఈ శ్రీనివాసరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
Advertisement