నగదు రహిత కొనుగోళ్లపై కసరత్తు
- వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో కలెక్టర్
అనంతపురం అర్బన్ : నగదు రహిత కొనుగోళ్లపై కసరత్తు చేసి ఆన్‌లైన్, డెబిట్, రూపే కార్డుల ద్వారా అవసరమైన వాటిని కొనుగోలు చేసుకునేలా సులువైన విధానం తీసుకురావాలని కలెక్టర్ కోన శశిధర్ అధికారులను ఆదేశించారు. ఆయన శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాస్థాయి అధికారులు, ఆర్డీఓలు, ఎంపీడీఓలు, తహశీల్దార్లు, బ్యాంకర్లు, ఏపీఎంలు, ఏపీడీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా యంత్రాంగం, బ్యాంకర్లు సంయుక్తంగా పని చేసి సామాన్యుల ఇబ్బందులను తగ్గించాలని, నగదు లేకపోతే పని జరగదనే భావనను తొలగించాలని సూచించారు. ఆ దిశగా కొన్ని మార్గదర్శకాలిచ్చారు.
- ప్రత్యేక డ్రైవ్ ద్వారా అన్ని వ్యాపార వర్గాలతో పీఓఎస్(పాయింట్ ఆఫ్ సేల్) యంత్రాలకు దరఖాస్తు చేయించాలి. రెవిన్యూ డివిజన్లు, మున్సిపాలిటీల్లో ఈ యంత్రాలు పొందేందుకు ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలి.
- జన్‌ధన్ ఖాతాదారులు రూపే కార్డు ఉపయోగించుకునేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలి.
- ఉపాధి కూలీలు, పింఛనుదారులకు అకౌంట్లు లేకపోతే వెంటనే జన్‌ధన్ యోజన కింద చేయించి రూపే కార్డులు అందించే ప్రక్రియను ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు తక్షణం ప్రారంభించాలి.