క్రికెట్ వ్యాఖ్యాత షోయబ్
-
ఇండో–రష్యన్ ప్రమోషనల్ సిరీస్‌కు వ్యాఖ్యాతగా ఆహ్వానం
-
మాస్కో వెళ్లేందుకు ఖర్చులకు డబ్బులు లేక ఇబ్బందులు
పెబ్బేరు: పెబ్బేరు పట్టణానికి చెందిన క్రికెట్ వ్యాఖ్యాత షోయబ్‌కు అరుదైన అవకాశం వచ్చింది. ఇదివరకు వివిధస్థాయిలో క్రికెట్ వ్యాఖ్యాతగా వ్యహరించిన షోయబ్‌కు ఈ నెలలో రష్యా రాజధాని మాస్కోలో జరుగుతున్న ఇండో–రష్యన్ ప్రమోషనల్ సిరీస్ క్రికెట్ టోర్నీలో వ్యాఖ్యాతగా వ్యవహరించేందుకు అవకాశం వచ్చింది. ఇప్పటివరకు బీసీసీఐ అనుబంధ సిరీస్‌లో క్రికెట్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన షోయబ్‌కు ప్రస్తుతం ఐసీసీ అఫిషియల్స్‌తో కలిసి వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశం రావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం ఎల్బీస్టేడియం కోచింగ్ సెంటర్ నుంచి షోయబ్‌ను అభినందిస్తూ లేఖ వచ్చింది.
కొంత ఆర్థిక ఇబ్బందులు..
నిరుపేద ముస్లిం కుటుంబానికి చెందిన షోయబ్ అనేక అవాంతరాలను ఎదుర్కొంటూ క్రికెట్ వ్యాఖ్యాతగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. ఇప్పటికే జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో వివిధ ప్రాంతాల్లో జరిగిన క్రికెట్ పోటీల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించి అందరి మన్ననలు పొందాడు. ప్రస్తుతం ఇండో–రష్యన్ ప్రమోషనల్ సిరీస్‌కు ఆహ్వానం రావడం గొప్పవిషయమే గానీ, మాస్కో వెళ్లేందుకు రవాణా ఖర్చులకు దాదాపు రూ.1.5లక్షలు అవుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్‌లో మరెన్నో అంతర్జాతీయ స్థాయి పోటీల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించేందుకు వీలవుతుంది. కానీ షోయబ్‌కు ఆ స్థోమత లేకపోవడంతో నిరాశపడుతున్నాడు. ‘మాస్కో వెళ్లేందుకు ప్రభుత్వంతో పాటు ఎవరైన దాతలు ఆదుకోవాలి. క్రీడాకారులకు పెద్దమనస్సుతో సహాయం చేయాలి. ఈ అవకాశం చేజారితే భవిష్యత్‌లో మళ్లీ అవకాశం ఉంటుందో లేదో’ అని షోయబ్ చెబుతున్నాడు.