Russia-Ukraine war: మాస్క్వా మునిగింది
కీవ్: గురువారం భారీగా దెబ్బతిన్న రష్యా ప్రఖ్యాత యుద్ద నౌక మాస్క్వా చివరకు సముద్రంలో మునిగిపోయింది. దెబ్బతిన్న నౌకను దగ్గరలోని నౌకాశ్రయానికి తరలిస్తుండగా మధ్యలోనే మునిగిపోయినట్లు రష్యా ప్రకటించింది. బ్లాక్‌సీ ఫ్లీట్‌కే తలమానికమైన నౌక మునిగిపోవడం రష్యాకు మరింత కోపం తెప్పించింది. దీంతో ఇకపై ఉక్రెయిన్ రాజధానిపై మరిన్ని మిసైల్ దాడులు జరుపుతామని ప్రకటించింది. రష్యా సరిహద్దు భూభాగంపై ఉక్రెయిన్ జరుపుతున్న మిలటరీ దాడులకు ప్రతిగా ఈ నిర్ణయం తీసుకున్నామని రష్యా రక్షణశాఖ ప్రకటించింది.
మాస్క్వా మిస్సైల్ క్రూయిజర్ ప్రత్యేకతలు
► రష్యా నేవీలో ఉన్న మూడు అట్లాంటా క్లాస్ గైడెడ్ మిస్సైల్ క్రూయిజర్లలో ఇది ఒకటి
► సిబ్బంది సంఖ్య: 680
► పొడవు: 186 మీటర్లు
► గరిష్ట వేగం: 32 నాటికల్ మైళ్లు(59 కి.మీ.)
ఆయుధ సంపత్తి
► 16 యాంటీ షిప్ వుల్కన్ క్రూయిజ్ మిస్సైళ్లు
► ఎస్–300 లాంగ్ రేంజ్ మెరైన్ వెర్షన్ మిస్సైళ్లు
► షార్ట్ రేంజ్ ఒస్సా మిస్సైళ్లు
► రాకెట్ లాంచర్స్, గన్స్, టార్పెడోస్
తూర్పు ఉక్రెయిన్ వైపు రష్యా బలగాలు మరలడంతో కీవ్‌లో జనజీవనం సాధారణస్థాయికి చేరుకుంటోంది. అయితే తాజా హెచ్చరికల నేపథ్యంలో తిరిగి బంకర్లలో తలదాచుకోవాల్సివస్తుందని నగర పౌరులు భయపడుతున్నారు. మాస్క్వా మునకకు అగ్ని ప్రమాదమే కారణమని రష్యా పేర్కొంది. అయితే తమ మిసైల్ దాడి వల్లనే నౌక మునిగిందని ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. వీరి వాదన నిజమైతే ఇటీవల కాలంలో ఒక యుద్ధంలో మునిగిన అతిపెద్ద నౌక మాస్క్వా కానుంది. ఇది రష్యాకు ఒకరకమైన ఓటమిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.
5 కాదు 50 రోజులు
ఉక్రెయిన్ ఆక్రమణకు గట్టిగా ఐదు రోజులు పడుతుందని రష్యా భావించిందని, కానీ 50 రోజులైనా రష్యా దాడులను తట్టుకొని నిలిచామని ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ వీడియో సమావేశంలో చెప్పారు. మాస్క్వా మునక గురించి పరోక్షంగా ప్రస్తావించారు. పోరాడాలని ఉక్రేనియన్లు నిర్ణయించుకొని 50 రోజులైందన్నారు. యుద్ధారంభంలో చాలామంది ప్రపంచ నేతలు తనకు దేశం విడిచి వెళ్లమని సలహా ఇచ్చారని, కానీ ఉక్రేనియన్లను వారు తక్కువగా అంచనా వేశారని చెప్పారు. 50 రోజులు ఎదురునిలిచి పోరాడుతున్నందుకు దేశప్రజలు గర్వించాలన్నారు.
అయితే మరోవైపు మారియూపోల్‌పై రష్యా పట్టుబిగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నగరాన్ని రష్యా సేనలు దాదాపు తమ అధీనంలోకి తెచ్చుకున్నాయని, అక్కడ ప్రజలు ఆహారం, నీరు దొరక్క అలమటిస్తున్నారని మీడియా వర్గాలు తెలిపాయి. నగరంలో రష్యా సైనికుల అకృత్యాలకు త్వరలో ఆధారాలు లభిస్తాయని, చాలా శవాలను రష్యన్లు రహస్యంగా ఖననం చేశారని ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. రష్యా సేనలు బొరోవయా ప్రాంతంలో పౌరులు ప్రయాణిస్తున్న బస్సుపై కాల్పులు జరిపి 7గురిని పొట్టనబెట్టుకున్నారని చెప్పారు. వీటిని రష్యా ఖండించింది.
మాస్క్వాకు అణు వార్‌హెడ్స్?
గురువారం నల్ల సముద్రంలో మునిగిన రష్యా యుద్ధ నౌక మాస్క్వాపై రెండు అణు వార్ హెడ్స్ అమర్చిఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే మునిగిన ప్రాంతంలో పర్యావరణ ప్రమాదం ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయమై వెంటనే విచారణ జరపాలన్న డిమాండ్ చేశారు. బ్రోక్ యారో ఘటన ( ఒక ప్రమాదంలో అణ్వాయుధాలుండడం)ను తేలిగ్గా తీసుకోకూడదన్నారు. సిబ్బందిలో చాలామంది మరణించే ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిలో 58 మంది మాత్రమే బతికారని, 452 మంది మునిగిపోయారని రష్యా బహిష్కృత నేత పొనొమరేవ్ ఆరోపించారు. మాస్క్వా మునకపై అడ్మిరల్ ఐగొర్ ఓసిపోవ్ను అరెస్టు చేశారని ఉక్రెయిన్ మీడియా పేర్కొంది.
20 వేల రష్యా సైనికులు మృతి?
ఇప్పటిదాకా ఏకంగా 20 వేల మంది రష్యా సైనికులను చంపినట్టు ఉక్రెయిన్ తాజాగా ప్రకటించింది. 160కి పైగా యుద్ధ విమానాలు, 200 హెలికాప్టర్లు, 800 ట్యాంకులు, 1,500కు పైగా సాయుధ వాహనాలు, 10 నౌకను ధ్వంసం చేసినట్టు పేర్కొంది. 2,000కు పైగా ఉక్రెయిన్ యుద్ధ ట్యాంకులను తాము నాశనం చేశామని రష్యా తెలిపింది. నాటోలో చేరితే తీవ్ర పర్యవసానాలు తప్పవని ఫిన్లాండ్, స్వీడన్లను తీవ్రంగా హెచ్చరించింది.
స్వదేశానికి 10 లక్షల మంది ఉక్రేనియన్లు
యుద్ధం ముగియనప్పటికీ ఉక్రెయిన్ నుంచి వలస వెళ్లిన వారిలో దాదాపుగా 10 లక్షల మంది స్వదేశానికి తిరిగొచ్చారు. ఇప్పుడప్పుడే రావొద్దని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా వారు పట్టించుకోవడం లేదు. కొద్ది రోజులుగా రోజుకు 30 వేల మంది దాకా తిరిగొస్తున్నట్టు సమాచారం. పోలండ్, రుమేనియా తదితర దేశాల సరిహద్దుల్లో ఉక్రెయిన్‌లోకి రావడానికి ప్రజలు భారీగా క్యూ కట్టారు.
కీవ్ చుట్టుపక్కల 900 మందికిపైగా మృతి
కీవ్: ఉక్రెయిన్ రాజధాని నగరం చుట్టూ మోహరించిన రష్యన్ సేనలు వెనక్కుమరలడంతో అక్కడ వారు చేసిన ఘోరాలు బయటపడుతున్నాయి. కీవ్ పరిసర ప్రాంతాల్లో 900 మందికి పైగా పౌరుల మృతదేహాలను కనుగొన్నట్లు స్థానిక పోలీసు అధికారి అండ్రీ చెప్పారు. చాలాచోట్ల మృతదేహాలు రోడ్లపై పడిపోయి ఉన్నాయని, కొన్ని చోట్ల అరకొర పూడ్చివేతలున్నాయని చెప్పారు. వీరిలో 95 శాతం మంది తుపాకీ గాయాలతో మరణించినట్లు తెలుస్తోందన్నారు. ఈ దేహాలను ఫొరెన్సిక్ పరీక్షలకు పంపామని తెలిపారు. ఎక్కువగా కీవ్‌కు సమీపంలోని బుచాలో 350 మృతదేహాలు దొరికినట్లు వివరించారు.