అన్ని రాష్ట్రాల్లో ‘కామన్’ ఇంటర్
♦ ఒకే సిలబస్, పరీక్షల విధానం అమలు చేయాలని కేంద్రం ఆదేశం
♦ ఇందుకోసం ప్రత్యేకంగా సబ్ కమిటీల ఏర్పాటు
♦ కామన్ సిలబస్ కమిటీ సభ్యుడిగా తెలంగాణ బోర్డు కార్యదర్శి
♦ {పశ్నపత్రాల రూపకల్పన విధాన కమిటీ సభ్యుడిగా ఏపీ బోర్డు కార్యదర్శి
♦ జూన్ 8లోగా అన్ని బోర్డులు మార్కులు పంపించాల్సిందే
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని 12వ తరగతి, ఇంటర్మీడియట్‌కు ఒకే సిలబస్ అమల్లోకి రానుంది. అంతేకాదు ఒకే తరహాలో పరీక్షల విధానం, ఫలితాల వెల్లడి ఉండనుంది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని కేంద్ర మానవ వనరుల శాఖ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన అన్ని రాష్ట్రాల ఇంటర్ బోర్డుల కార్యదర్శులు, ఎన్‌ఐటీ, ఐఐటీ ప్రవేశాల కమిటీలతో మానవ వనరుల శాఖ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డుల కార్యదర్శులు అశోక్, సత్యనారాయణ హాజరయ్యారు.
ఈ సందర్భంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) విద్యాసంస్థల్లో అమల్లో ఉన్న 12వ తరగతి, రాష్ట్ర విద్యా సంస్థల్లో అమల్లో ఉన్న ఇంటర్ విద్యా విధానాన్ని మానవ వనరుల శాఖ సమీక్షించి... పలు అంశాలపై ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు, అన్ని బోర్డుల్లో 12వ తరగతి, ఇంటర్ సిలబస్ ఓకేలా ఉండేలా, ఇందుకు ఏయే సబ్జెక్టుల సిలబస్‌లో ఎలాంటి మార్పులు తీసుకురావాలన్న అంశాలపై అధ్యయనం చేసేందుకు సబ్ కమిటీలను ఏర్పాటు చేసింది. కామన్ సిలబస్‌పై ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుడిగా తెలంగాణ ఇంటర్‌బోర్డు కార్యదర్శిని నియమించినట్లు తెలిసింది.
అలాగే పరీక్షల విధానం, ప్రశ్నపత్రాల ప్యాట్రన్ కూడా కామన్‌గా ఉండేలా చర్యలు చేపట్టాలని మానవ వనరులశాఖ సూచించింది. సాధారణంగా ప్రశ్నపత్రాల్లో 40 శాతం ప్రశ్నలు సులభంగా, 40 శాతం మాడరేట్‌గా, మరో 20 శాతం ఇంటర్‌ప్రిటేషన్‌తో కూడినవిగా ఉండాలన్న నిబంధన ఉంది. కానీ రాష్ట్రాలు దీనిని సరిగా పాటించడం లేదు. దీంతో ప్రశ్నపత్రాల రూపకల్పనలో కామన్ ప్యాట్రన్ అమలుకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేసేందుకు ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శిని సభ్యుడిగా నియమించినట్లు తెలిసింది.
ఇక ఒక్కో రాష్ట్రం ఒక్కో సమయంలో ఇంటర్ పరీక్షలు నిర్వహించి, ఫలితాలు వెల్లడిస్తుండడంతో... మార్కుల జాబితాలను పరిశీలన, వెయిటేజీ కోసం జాతీయ స్థాయి విద్యాసంస్థలకు పంపడంలో జాప్యం జరుగుతోంది. దీనివల్ల ఎన్‌ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలు ఆలస్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, బోర్డులు ఏటా జూన్ 8వ తేదీలోగా తమ పరిధిలో ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థుల మార్కులను ఎన్‌ఐటీ, ఐఐటీ ప్రవేశాల కమిటీలకు పంపాలని స్పష్టం చేసింది. అలాగే సీబీఎస్‌ఈ విద్యాసంస్థల్లో, ఇంటర్ బోర్డుల్లో ఇస్తున్న సబ్జెక్టు కోడ్‌లు వేర్వేరుగా ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని... ఒక్కో సబ్జెక్టుకు అన్ని బోర్డుల్లో ఒకే కోడ్ (కామన్ కోడ్) ఉండేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది. విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్న నేపథ్యంలో లెక్చరర్లకు మారుతున్న పరిస్థితులపై అవగాహన అవసరమని, పెద్ద ఎత్తున ఓరియంటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది. ఈ అంశాలన్నింటిపై నవంబర్ నెలాఖరు లేదా డిసెంబర్ తొలి వారంలో మరోసారి సమావేశమై చర్చించాలని నిర్ణయించింది.