Andhra pradesh Intermediate board
-
గుడ్‌న్యూస్.. వరద బాధితులకు ఉచితంగా ఇంటర్ సర్టిఫికెట్లు
సాక్షి, అమరావతి: ఇటీవల ఆగస్టులో కురిసిన భారీ వర్షాలు, సెప్టెంబర్‌లో సంభవించిన వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చాలామంది తమ సర్టిఫికెట్లు కోల్పోయారు. ఇలాంటి వారికి ఉచితంగా సర్టిఫైడ్ కాపీలు/ డూప్లికేట్ సర్టిఫికెట్లు అందించాలని ఇంటర్ విద్యా మండలి నిర్ణయించినట్లు ఇంటర్ విద్య కార్యదర్శి కృతికా శుక్లా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అంశంపై వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆర్ఐవోలు, డీఐఈవోలు విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. అభ్యర్థులు వారు చదువుకున్న కాలేజీ ప్రిన్సిపల్, జిల్లా అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని, లేదా నేరుగా బోర్డు అధికారులను గాని సంప్రదించాలని సూచించారు.పదో తరగతి హిందీ సిలబస్ కుదింపుసాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 1,000 ప్రభుత్వ సీబీఎస్ఈ స్కూళ్లను ప్రభుత్వం స్టేట్ సిలబస్‌లోకి మార్చిన నేపథ్యంలో ఆయా స్కూళల్లో సిలబస్‌ను నవంబర్ 30లోగా పూర్తి చేయాలని పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారు. పదో తరగతి విద్యార్థులకు ఎస్సెస్సీ బోర్డు పరీక్షలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా హిందీ సిలబస్ అధికంగా ఉన్న నేపథ్యంలో కొన్ని చాప్టర్లను తొలగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ స్కూళ్ల విద్యార్థులకు జూన్– జూలై సిలబస్‌తో ఎఫ్ఏ–1 హిందీ నమూనా పరీక్షను మంగళవారం పూర్తి చేశామని తెలిపారు. అలాగే, కొత్త విధివిధానాల ప్రకారం పదో తరగతి విద్యార్థులకు హిందీ సిలబస్ అధికంగా ఉన్నందున పద్యభాగ్–7 (ఆత్మత్రాణ్), గద్యభాగ్–11 (తీసరీ కసమ్ కే వశల్ పకార్ శేలేంద్ర), గద్యభాగ్–12 (అబ్ కహా దూస్రోంకే దుఖ్ సే దుఖీ హోనీవాలీ), ఉపవాచక్–3 (టోపీ శుక్లా) పాఠాలను తొలగిస్తున్నట్టు తెలిపారు. కేఎల్‌యూ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష పోస్టర్ విడుదలతాడేపల్లిరూరల్ : గుంటూరు జిల్లా వడ్డేశ్వరం కేఎల్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ క్యాంపస్‌లలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశ నిమిత్తం జాతీయస్థాయిలో నిర్వహించనున్న ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష 2025 పోస్టర్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష, విద్యావిధానం, మెరిట్ విద్యార్థులకు ఇచ్చే రాయితీలు, స్కాలర్షిప్ విధానం గురించి యూనివర్సిటీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. యూనివర్సిటీ ప్రో చాన్సలర్ డాక్టర్ జగన్నాథరావు, వైస్ చాన్సలర్ డాక్టర్ పార్థసారథి వర్మ, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె. శ్రీనివాసరావు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. డాక్టర్ పార్థసారథి వర్మ మాట్లాడుతూ యూనివర్సిటీ అందించే ఇంజినీరింగ్ కోర్సులకు మొదటి విడత ప్రవేశ పరీక్షను డిసెంబర్ 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
AP Inter Results 2022: ఇంటర్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే..
సాక్షి అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు జూన్ 22వ తేదీ (బుధవారం) విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఫలితాలను విడుదల చేశారు. కాగా, ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం వేగంగా పూర్తి చేశారు. మే 6వ తేదీ నుంచి ఫస్టియర్, 7వ తేదీ నుంచి సెకండియర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలను సాక్షిఎడ్యుకేషన్.కామ్(www.sakshieducation.com)లో చూడొచ్చు. 10.01 లక్షల మంది విద్యార్థులు.. ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,456 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మే 24వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షలను ఏపీ ఇంటర్ బోర్డు పటిష్ట ఏర్పాట్లతో పూర్తిచేసింది. ఈ సారి పరీక్షలను.. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో నెలకొన్న ఘటనలను దృష్టిలో పెట్టుకొని ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు. అలాగే పరీక్ష కేంద్రాల్లో అన్ని గదుల్లోనూ, బయట సీసీ కెమెరాలను అమర్చారు. ఈ కెమెరాల ద్వారా పరీక్షల తీరుతెన్నులను రికార్డు చేయడంతోపాటు వాటన్నింటినీ ఇంటర్ బోర్డు కార్యాలయానికి అనుసంధానించారు. ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా బోర్డు అధికారులు పరీక్షలు జరుగుతున్న తీరును నిత్యం పరిశీలిస్తారు. జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక కమిటీలు ఇంటర్ పరీక్షలను పర్యవేక్షించారు. -
‘ఒత్తిడి చేస్తే కాలేజీల గుర్తింపు రద్దు చేస్తాం’
సాక్షి, అమరావతి : స్టడీ మెటీరియల్స్, యూనిఫారాలు కొనుగోలు చేయాలంటూ విద్యార్థులు, తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్న ప్రైవేట్ ఇంటర్ కాలేజీ యాజమాన్యాలపై ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ బోర్డు సెక్రటరీ రామకృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. ఒత్తిడి చేస్తున్నట్లు విద్యార్థులు,లేదా తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ఫిర్యాదు వచ్చినా ఆ కాలేజీ గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు. మొయిల్ ద్వారా లేదా వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఒత్తిడి చేసే కాలేజీలపై ourbiep@gmail.comకు ఈమెయిల్ ద్వారా, 9393282578 నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా, కోవిడ్–19 నేపథ్యంలో విద్యాసంవత్సరంలో కాలేజీల్లో బోధన సాగించే పరిస్థితి లేకపోవడం, తరగతుల నిర్వహణ ఆలస్యం కానుండడంతో ఇంటర్మీడియెట్ బోర్డు సిలబస్‌ను 30 శాతం మేర కుదించింది. ఈ మేరకు ఆయా సబ్జెక్టులకు సంబంధించి కుదించిన సిలబస్ సమాచారాన్ని బోర్డు వెబ్సైట్లో పొందుపరిచింది. సైన్స్, ఆర్ట్స్ సబ్జెక్టులకు సంబంధించి బోధనాంశాలు ఏవి? కుదింపు అంశాలు ఏవో వివరిస్తూ పాఠ్యాంశాల వారీగా వివరాలను అధికారిక వెబ్సైట్లో పెట్టింది. -
ఏపీ విద్యార్థులకు న్యాయం చేయండి...
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఇంటర్‌బోర్డు గ్రేడింగ్ విధానంతో ఢిల్లీ యూనివర్సీటీలో ఏపీ విద్యార్థులు పడుతున్న కష్టాలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీ ప్రవేశాల్లో ఏపీ విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన శనివారం ఆ వర్సిటీ ఉపకులపతికి లేఖ రాశారు. ఏపీలో మార్కుల విధానానికి బదులు పర్సంటేజీ ప్రకారం గ్రేడింగ్ పాయింట్లు ప్రవేశపెట్టారన్నారు. ఈ విధానంలో వచ్చిన గ్రేడ్లను 10తో కాకుండా వర్సిటీ కేవలం 9.5తో గుణిస్తుండడంతో ఏపీ విద్యార్థులు సీట్లు కోల్పోతారని పేర్కొన్నారు. ఈ విషయంలో సానుకూలంగా స్పందించాలని వీసీని మంత్రి కోరారు. కాగా దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ఇంటర్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేషన్ కోసం ఢిల్లీ వర్సిటీ, దాని అనుంబంధ కళాశాలల్లో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇంటర్లో మార్కులకు బదులుగా రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టిన సీజీపీఏ గ్రేడ్ల విధానం వల్ల ఏపీ విద్యార్థులకు ప్రవేశాలు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇతర రాష్ట్రాల్లో యూజీ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకొనే ఏపీ విద్యార్థుల గ్రేడ్ పాయింట్లను 10తో గుణించి వచ్చే శాతాన్ని అడ్మిషన్ల ప్రక్రియలో పరిగణించాలని ఇంటర్ బోర్డు విద్యార్థులకు జారీ చేసిన మెమోలో స్పష్టం చేసింది. అయితే ఢిల్లీ వర్సిటీ మాత్రం తమకు ఏపీ ఇంటర్ బోర్డు నుంచి సమాచారం లేదంటూ విద్యార్థుల గ్రేడ్ పాయింట్లను 10తో కాకుండా 9.5తోనే గుణిస్తామంటూ స్పష్టం చేయడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తాము తీవ్రంగా నష్టపోతామని, కోరుకున్న కాలేజీలో ఎంచుకున్న కోర్సులో సీటు దక్కదని వాపోతున్నారు. సోమవారం మధ్యాహ్నంతో మొదటి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తవుతుందని, ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్ బోర్డు తక్షణం స్పందించి తమకు న్యాయం చేయాలని అడ్మిషన్ల కోసం ఢిల్లీ వచ్చిన సుమారు 550 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై శనివారం ఢిల్లీలో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్‌ను కలసి సమస్యను వివరించారు. దీంతో ఆయన ఢిల్లీ వర్సిటీ తీరును వివరిస్తూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి ఆర్ సుబ్రహ్మణ్యంకు లేఖ రాశారు. -
ఈ నెల మూడో వారంలో ఎంసెట్ ఫలితాలు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రి, మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఎంసెట్–2019 తుది ఫలితాలను ఈ నెల మూడో వారంలో విడుదల చేయనున్నారు. ఎంసెట్ ఫలితాల విడుదలపై సందిగ్థత, ఇతర సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బుధవారం సమీక్ష నిర్వహించారు. ఇందులో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ విజయరాజు, ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి దమయంతి, ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి, ఎంసెట్ చైర్మన్ రామచంద్రరాజు, కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్.సాయిబాబు, ఉన్నత విద్యా మండలి కార్యదర్శి వరదరాజన్, ప్రవేశాల ప్రత్యేకాధికారి డాక్టర్ రఘునాధ్ తదితరులు పాల్గొన్నారు. ఎంసెట్ ఫలితాల విడుదలకు ఆటంకంగా ఉన్న పలు అంశాలపై సీఎస్ వారితో చర్చించారు. ఫలితాల విడుదలపై తొందర అవసరం లేదని, ఏపీ ఇంటర్మీడియెట్ మార్కులతోపాటు, తెలంగాణ ఇంటర్మీడియెట్ మార్కులు కూడా వచ్చాకే తుది ఫలితాలు విడుదల చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. మే మూడో వారంలో ఫలితాల విడుదలకు నిర్ణయించారు. తెలంగాణ ఇంటర్ మార్కులు వచ్చాక ఎంసెట్ ర్యాంకులను ప్రకటించనున్నారు. గోప్యంగా ఉంచుతామని హామీ ఇవ్వడంతో ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు ఈ ఏడాది ఫలితాలను గ్రేడింగ్ విధానంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఎంసెట్‌కు హాజరైన విద్యార్థుల ఇంటర్ మార్కులను అందించడంలో సమస్య ఏర్పడింది. మార్కులు బయటకు వెల్లడించడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయన్న భావనతో బోర్డు అధికారులు.. ఎంసెట్ అధికారులకు మార్కులు ఇచ్చేందుకు తర్జనభర్జన పడ్డారు. ఎటువంటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారని, మార్కులను ఎంసెట్ కమిటీకి అందించాలని సీఎస్ సుబ్రహ్మణ్యం ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మికి సూచించారు. బయటకు వెల్లడి కావన్న షరతుతో ఈ మార్కులు అందించేందుకు బోర్డు నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి కూడా ఇంటర్మీడియెట్ మార్కుల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామనడంతో సమస్య పరిష్కారమైంది. తెలంగాణ బోర్డు నుంచి వచ్చే వరకు నిరీక్షణ తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు తీవ్ర గందరగోళంలో పడిన నేపథ్యంలో వాటి సమాచారం ఎప్పటికి వస్తుందో అనే అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. ఏపీ ఎంసెట్–2019కు మొత్తం 2,67,627 మంది హాజరయ్యారు. వీరిలో తెలంగాణలో ఇంటర్ చదివినవారు 40,242 మంది ఉన్నారు. వీరిలో 14 వేల మంది వరకు తెలంగాణకు చెందిన విద్యార్థులు కాగా తక్కినవారు అక్కడ సెటిలైన ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. ఇలా వేలాది సంఖ్యలో తెలంగాణ విద్యార్థులు ఏపీ ఎంసెట్‌కు హాజరైనందున వారి మార్కులు కూడా వచ్చాకనే తుది ఫలితాలు విడుదల చేయాలని సీఎస్ అధికారులకు సూచించారు. తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలపై అక్కడి హైకోర్టు ఈ నెల 8 వరకు గడువు ఇచ్చినందున రెండో వారంలో ఆ ఫలితాలను అక్కడి బోర్డు ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి మే మూడో వారంలో ఎంసెట్ ఫలితాలను విడుదల చేసేలా షెడ్యూల్‌ను నిర్ణయించుకోవాలని సీఎస్ సూచించారని సమావేశంలో పాల్గొన్న ఉన్నత విద్యామండలి అధికారులు పేర్కొన్నారు. జూన్‌లో ఎంసెట్ కౌన్సెలింగ్ మే మూడో వారంలో ఎంసెట్ ఫలితాలు ప్రకటించాక ప్రవేశాలపై ఉన్నత విద్యా మండలి దృష్టి సారించనుంది. జూలై నుంచి ఇంజనీరింగ్ తరగతులను ప్రారంభించేలా షెడ్యూల్‌ను ఖరారు చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. దాని ప్రకారం ఎంసెట్ కౌన్సెలింగ్‌ను జూన్ రెండో వారం నుంచి ప్రారంభించి, జూలై నాటికి ప్రవేశాలను పూర్తి చేయించి, అనంతరం తరగతుల ప్రారంభానికి వీలుగా చర్యలు తీసుకోనున్నామని ఉన్నత విద్యా మండలి వర్గాలు వివరించాయి. -
అన్ని రాష్ట్రాల్లో ‘కామన్’ ఇంటర్
♦ ఒకే సిలబస్, పరీక్షల విధానం అమలు చేయాలని కేంద్రం ఆదేశం ♦ ఇందుకోసం ప్రత్యేకంగా సబ్ కమిటీల ఏర్పాటు ♦ కామన్ సిలబస్ కమిటీ సభ్యుడిగా తెలంగాణ బోర్డు కార్యదర్శి ♦ {పశ్నపత్రాల రూపకల్పన విధాన కమిటీ సభ్యుడిగా ఏపీ బోర్డు కార్యదర్శి ♦ జూన్ 8లోగా అన్ని బోర్డులు మార్కులు పంపించాల్సిందే సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని 12వ తరగతి, ఇంటర్మీడియట్‌కు ఒకే సిలబస్ అమల్లోకి రానుంది. అంతేకాదు ఒకే తరహాలో పరీక్షల విధానం, ఫలితాల వెల్లడి ఉండనుంది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని కేంద్ర మానవ వనరుల శాఖ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన అన్ని రాష్ట్రాల ఇంటర్ బోర్డుల కార్యదర్శులు, ఎన్ఐటీ, ఐఐటీ ప్రవేశాల కమిటీలతో మానవ వనరుల శాఖ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డుల కార్యదర్శులు అశోక్, సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విద్యాసంస్థల్లో అమల్లో ఉన్న 12వ తరగతి, రాష్ట్ర విద్యా సంస్థల్లో అమల్లో ఉన్న ఇంటర్ విద్యా విధానాన్ని మానవ వనరుల శాఖ సమీక్షించి... పలు అంశాలపై ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు, అన్ని బోర్డుల్లో 12వ తరగతి, ఇంటర్ సిలబస్ ఓకేలా ఉండేలా, ఇందుకు ఏయే సబ్జెక్టుల సిలబస్‌లో ఎలాంటి మార్పులు తీసుకురావాలన్న అంశాలపై అధ్యయనం చేసేందుకు సబ్ కమిటీలను ఏర్పాటు చేసింది. కామన్ సిలబస్‌పై ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుడిగా తెలంగాణ ఇంటర్‌బోర్డు కార్యదర్శిని నియమించినట్లు తెలిసింది. అలాగే పరీక్షల విధానం, ప్రశ్నపత్రాల ప్యాట్రన్ కూడా కామన్‌గా ఉండేలా చర్యలు చేపట్టాలని మానవ వనరులశాఖ సూచించింది. సాధారణంగా ప్రశ్నపత్రాల్లో 40 శాతం ప్రశ్నలు సులభంగా, 40 శాతం మాడరేట్‌గా, మరో 20 శాతం ఇంటర్‌ప్రిటేషన్‌తో కూడినవిగా ఉండాలన్న నిబంధన ఉంది. కానీ రాష్ట్రాలు దీనిని సరిగా పాటించడం లేదు. దీంతో ప్రశ్నపత్రాల రూపకల్పనలో కామన్ ప్యాట్రన్ అమలుకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేసేందుకు ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శిని సభ్యుడిగా నియమించినట్లు తెలిసింది. ఇక ఒక్కో రాష్ట్రం ఒక్కో సమయంలో ఇంటర్ పరీక్షలు నిర్వహించి, ఫలితాలు వెల్లడిస్తుండడంతో... మార్కుల జాబితాలను పరిశీలన, వెయిటేజీ కోసం జాతీయ స్థాయి విద్యాసంస్థలకు పంపడంలో జాప్యం జరుగుతోంది. దీనివల్ల ఎన్ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలు ఆలస్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, బోర్డులు ఏటా జూన్ 8వ తేదీలోగా తమ పరిధిలో ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థుల మార్కులను ఎన్ఐటీ, ఐఐటీ ప్రవేశాల కమిటీలకు పంపాలని స్పష్టం చేసింది. అలాగే సీబీఎస్ఈ విద్యాసంస్థల్లో, ఇంటర్ బోర్డుల్లో ఇస్తున్న సబ్జెక్టు కోడ్లు వేర్వేరుగా ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని... ఒక్కో సబ్జెక్టుకు అన్ని బోర్డుల్లో ఒకే కోడ్ (కామన్ కోడ్) ఉండేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది. విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్న నేపథ్యంలో లెక్చరర్లకు మారుతున్న పరిస్థితులపై అవగాహన అవసరమని, పెద్ద ఎత్తున ఓరియంటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది. ఈ అంశాలన్నింటిపై నవంబర్ నెలాఖరు లేదా డిసెంబర్ తొలి వారంలో మరోసారి సమావేశమై చర్చించాలని నిర్ణయించింది. -
అధికారులను వదిలి.. అల్పులపై వేటు
తెలంగాణ విద్యార్థులకు ఏపీ ఇంటర్ బోర్డు మెమోల జారీలో చర్యలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు నుంచి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ బోర్డు పేరుతో మెమోలు జారీ చేసిన వ్యవహారంలో అధికారులను వదిలేసి.. కిందిస్థాయి సిబ్బందిపై విద్యాశాఖ వేటువేసింది. అసలు పొరపాటు ఎక్కడ జరిగింది.. ఎలా జరిగింది.. విశ్లేషించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకుండా కిందిస్థాయి సిబ్బంది ముగ్గురిని (సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్) సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంది. పొరపాటు జరగడానికి కారణమైన ఉన్నత ఆధికారులు, ముందుగా పక్కా చర్యలు చేపట్టడంలో విఫలమైన పరీక్షల విభాగం అధికారులను పట్టించుకోకుండా ఈ చర్యలకు దిగడంపై ఇంటర్ బోర్డు ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2014 జూన్ కంటే ముందే ఇంటర్ బోర్డు సిబ్బందిని అనధికారికంగానే విభజించారు. కానీ, రెండు రాష్ట్రాలకు ఒకే కంప్యూటర్ ల్యాబ్‌ను కొనసాగించారు. దీనిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంలో ముందుగా చర్యలు చేపట్టాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్ మెమోలు ముద్రితమయ్యే ల్యాబ్‌లోనే తెలంగాణ మెమోలను ముద్రించేందుకు అనుమతి ఇచ్చిన అధికారులపై చర్యలు చేపట్టాలని సిబ్బంది పేర్కొంటున్నారు. ఆ తరువాత మార్కులను ముద్రించే మెమో పేపర్ ఇచ్చిన అధికారులపై చర్యలు చేపట్టాలని చెబుతున్నారు. ఆ పేపరు ఇచ్చాకే విద్యార్థుల పేర్లు, మార్కులు ముద్రిస్తారని, బోర్డు పేరు ముందుగానే ముద్రించి ఉన్నా తప్పుడు పేపరు ఇచ్చిన ఆ అధికారులను వదిలేసి సిబ్బందిని బాధ్యులను చేయడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. -
ఇంటర్మీడియెట్ బోర్డు తెలంగాణదే!
అదీనంలోకి తీసుకునేందుకు రాష్ట్రప్రభుత్వం కసరత్తు * సెక్షన్ 75 ప్రకారం సంస్థ ఎక్కడ ఉంటే దానికే అధికారం * విభజన చట్టం చెబుతున్నదిదే * ఏపీ కోరితే సేవలకు సిద్ధం * వేరుగానే ఇంటర్ పరీక్షలు! సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ బోర్డుపై అధికారం తమకే ఉంటుందని, ఈ దృష్ట్యా బోర్డును తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ దిశలో రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 75 ప్రకారం బోర్డు తెలంగాణ ప్రభుత్వ పరిధిలోనే పని చేయాలని, ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. బోర్డును తమ ఆధీనంలోకి తీసుకుని, ఆంధ్రప్రదేశ్ కోరితే వారికి అవసరమైన సేవలు అందించాలని భావిస్తోం ది. ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో, మంత్రి జగదీశ్‌రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశం లోనూ ఇంటర్ బోర్డును తమ పరిధిలోకి తెచ్చుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. సెక్షన్ 75 ఏం చెబుతోందంటే... ‘పదో షెడ్యూలులోని సంస్థలు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్ర పరిధిలోకే వస్తాయి. అయితే పొరుగు రాష్ట్రానికి ఏడాదిపాటు ఆ సంస్థ సేవలు అందించాలి. రాష్ట్ర విభజనకు ముందు ఎలాంటి సేవలు అందాయో ఆలాంటి సేవలను కొనసాగించాలి. ఎలాంటి తేడా చూపడానికి వీల్లేదు’ అని విభజన చట్టంలో సెక్షన్ 75 చెబుతోంది. వేర్వేరుగా పరీక్షల ఏర్పాట్లు ఇంటర్మీడియెట్ పరీక్షలను వేర్వేరుగానే నిర్వహించేందుకు బోర్డు అధికారులు రెండు రాష్ట్రాలకు అవసరమైన ప్రశ్న, జవాబు పత్రాల పేప రు కొనుగోలు, ముద్రణకు సంబంధించిన టెం డర్లను గురువారం పిలిచారు. రెండు రాష్ట్రాలకు వేర్వేరుగానే సరఫరా చేసేలా టెండర్ నోటిఫికేషన్లో నిబంధన విధించారు. ఏపీకి, తెలంగాణకు వేర్వేరుగా ప్రశ్నపత్రాలు ఇచ్చేలా చర్యలు చేపడుతోంది. రెండు రాష్ట్రాలు కలిపి ఒకే ప్రశ్నపత్రం తో పరీక్షలు నిర్వహిస్తే మూడు సెట్లను ముద్రిం చాలని భావిస్తోంది. లేదంటే 6 సెట్లను ముద్రిం చి ఒక్కో రాష్ట్రానికి 3 సెట్లు అందజే యనుంది. రెండు, మూడు రోజుల్లో షెడ్యూలు ఖరారు! ప్రస్తుతం పరీక్షలు వేర్వేరుగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టగా, ప్రశ్నపత్రాలు వేర్వేరుగా ఇవ్వాలా? రెండు రాష్ట్రాల్లో ఒకే రకమైన ప్రశ్నపత్రాలను ఇవ్వాలా? అనేది తేలాల్సి ఉంది. ఇంటర్ బోర్డు పరీక్షల షెడ్యూలును సిద్ధం చేసే పనిలో పడింది. షెడ్యూళ్లను కూడా రెండు రకాలుగా సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. దీంతోపాటు నిర్ణీత తేదీల్లోగా ప్రశ్నపత్రాల వ్యవహారాన్ని తేల్చాలంటూ రెండు రాష్ట్రాలను కోరాలని బోర్డు నిర్ణయానికి వచ్చింది. -
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటు
ఏపీ ఇంటర్ బోర్డు చట్టం వర్తింపజేస్తూ ఏర్పాటు విద్యాశాఖ మంత్రి చైర్మన్‌గా బోర్డు... సభ్యుల్లో ఒకరు వైస్ చైర్మన్ 10 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉత్తర్వులు జూన్ 2 నుంచే అమల్లోకి సంబురాలు చేసుకున్న ఉద్యోగులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటు అయింది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు చట్టాన్ని తెలంగాణ బోర్డుకు వర్తింపజేస్తూ తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్ సోమవారం జీవో 21 జారీ చేశారు. బోర్డు స్వరూపం, అందులో ఉండే అధికారులు, వారి స్థాయి తదితర వివరాలను ఉత్తర్వుల్లో వివరించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని 101వ సెక్షన్ ప్రకారం ఈ ఉత్తర్వు లను వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్తర్వులు జూన్ 2 నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ యాక్ట్-1971లో ‘ఆంధ్రప్రదేశ్’ అని ఉన్న స్థానంలో ‘తెలంగాణ’ పదాన్ని చేర్చి, బోర్డుకు ఆ నిబంధనలను వర్తింపజేస్తున్నట్లు పేర్కొన్నారు. బోర్డులో ఉండాల్సిన ఎక్స్ అఫిషియో సభ్యులు, నామినేటెడ్ సభ్యులు, కో-ఆప్టెడ్ సభ్యులు, వైస్ చైర్మన్ పదవులకు నియమించే వారి బాధ్యతలను వివరించారు. ఇదీ బోర్డు స్వరూపం..: విద్యాశాఖ మంత్రి చైర్మన్‌గా వ్యవహరించే తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డులో ఎక్స్ అఫిషియో సభ్యులుగా 10 మంది ఉంటారు. అందులో విద్యాశాఖ కార్యదర్శి, కళాశాల విద్య కమిషనర్ అండ్ డెరైక్టర్, పాఠశాల విద్య కమిషనర్ అండ్ డెరైక్టర్, ఇంటర్ విద్య కమిషనర్ అండ్ డెరైక్టర్, సాంకేతిక విద్యా డెరైక్టర్, మెడికల్ సర్వీసెస్ డెరైక్టర్, ఇండ స్ట్రీస్ డెరైక్టర్, అగ్రికల్చర్ డెరైక్టర్, తె లుగు అకాడమీ డెరైక్టర్, కార్యదర్శి ఉంటారు. అలాగే ఆర్థిక శాఖ నుంచి ఒకరు, రాష్ట్రంలోని ఒక్కో యూనివర్సిటీ నుంచి ఒక్కొక్కరిని, ఏదైనా డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ ఒకరిని సభ్యులుగా నామినేట్ చేస్తారు. మరో ఆరుగురిని గుర్తింపు పొందిన, అనుబంధ జూనియర్ కాలేజీల నుంచి, ప్రైవేటు కాలేజీల నుంచి, మహిళ జూనియర్ కాలేజీల నుంచి నియమిస్తారు. బోర్డు నిబంధనల ప్రకారం విషయ నిపుణులు ముగ్గురిని కో-ఆప్టెడ్ సభ్యులుగా నియమిస్తారు. బోర్డు సభ్యుల్లో ఒకరిని వైస్ చైర్మన్‌గా నియమిస్తారు. పాలనాపరమైన అంశాలతో పాటు అన్నింటిలో చైర్మన్‌కు వైస్ చైర్మన్ సహకారం అందించాల్సి ఉంటుంది. చైర్మన్ లేనపుడు వైస్ చైర్మన్ విధులు నిర్వర్తిస్తారు. ఉద్యోగుల హర్షం.. బోర్డు ఏర్పాటు ఉత్తర్వులు జారీ కావడంతో ఇంటర్మీడియట్ బోర్డులోని తెలంగాణ ఉద్యోగులు, అధికారులు పెద్దఎత్తున సంబురాలు జరుపుకున్నారు. ఉద్యోగులు ఒకరికి ఒకరు స్వీట్లు పంచుకొని బాణసంచా పేల్చారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ విద్యా జేఏసీ కన్వీనర్ మధుసూదన్‌రెడ్డి, బోర్డు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, అధికారుల సంఘం అధ్యక్షుడు భీంసింగ్, ప్రిన్సిపాళ్ల సంఘం అధ్యక్షుడు అంజన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బోర్డు ఏర్పాటైనందున ఏపీతో సంబంధం లేకుండా తెలంగాణలో వేరుగానే పరీక్షలు జరుగుతాయని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేశారు.