అధికారులను వదిలి.. అల్పులపై వేటు | AP Inter Board Memo issued to Telangana students | Sakshi
Sakshi News home page

అధికారులను వదిలి.. అల్పులపై వేటు

Published Thu, Jun 4 2015 2:44 AM | Last Updated on Sun, Sep 3 2017 3:10 AM

AP Inter Board Memo issued to Telangana students

తెలంగాణ విద్యార్థులకు ఏపీ ఇంటర్ బోర్డు మెమోల జారీలో చర్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు నుంచి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ బోర్డు పేరుతో మెమోలు జారీ చేసిన వ్యవహారంలో అధికారులను వదిలేసి.. కిందిస్థాయి సిబ్బందిపై విద్యాశాఖ వేటువేసింది. అసలు పొరపాటు ఎక్కడ జరిగింది.. ఎలా జరిగింది.. విశ్లేషించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకుండా కిందిస్థాయి సిబ్బంది ముగ్గురిని (సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్) సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంది.

పొరపాటు జరగడానికి కారణమైన ఉన్నత ఆధికారులు, ముందుగా పక్కా చర్యలు చేపట్టడంలో విఫలమైన పరీక్షల విభాగం అధికారులను పట్టించుకోకుండా ఈ చర్యలకు దిగడంపై ఇంటర్ బోర్డు ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2014 జూన్ కంటే ముందే ఇంటర్ బోర్డు సిబ్బందిని అనధికారికంగానే విభజించారు. కానీ, రెండు రాష్ట్రాలకు ఒకే కంప్యూటర్ ల్యాబ్‌ను కొనసాగించారు. దీనిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ వ్యవహారంలో ముందుగా చర్యలు చేపట్టాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్ మెమోలు ముద్రితమయ్యే ల్యాబ్‌లోనే తెలంగాణ మెమోలను ముద్రించేందుకు అనుమతి ఇచ్చిన అధికారులపై చర్యలు చేపట్టాలని సిబ్బంది పేర్కొంటున్నారు. ఆ తరువాత మార్కులను ముద్రించే మెమో పేపర్ ఇచ్చిన అధికారులపై చర్యలు చేపట్టాలని చెబుతున్నారు. ఆ పేపరు ఇచ్చాకే విద్యార్థుల పేర్లు, మార్కులు ముద్రిస్తారని, బోర్డు పేరు ముందుగానే ముద్రించి ఉన్నా తప్పుడు పేపరు ఇచ్చిన ఆ అధికారులను వదిలేసి సిబ్బందిని బాధ్యులను చేయడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement