తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటు
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటు
Published Tue, Oct 21 2014 1:36 AM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
ఏపీ ఇంటర్ బోర్డు చట్టం వర్తింపజేస్తూ ఏర్పాటు
విద్యాశాఖ మంత్రి చైర్మన్‌గా బోర్డు... సభ్యుల్లో ఒకరు వైస్ చైర్మన్
10 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు
ఉత్తర్వులు జూన్ 2 నుంచే అమల్లోకి
సంబురాలు చేసుకున్న ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటు అయింది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు చట్టాన్ని తెలంగాణ బోర్డుకు వర్తింపజేస్తూ తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్ సోమవారం జీవో 21 జారీ చేశారు. బోర్డు స్వరూపం, అందులో ఉండే అధికారులు, వారి స్థాయి తదితర వివరాలను ఉత్తర్వుల్లో వివరించారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014లోని 101వ సెక్షన్ ప్రకారం ఈ ఉత్తర్వు లను వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్తర్వులు జూన్ 2 నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ యాక్ట్-1971లో ‘ఆంధ్రప్రదేశ్’ అని ఉన్న స్థానంలో ‘తెలంగాణ’ పదాన్ని చేర్చి, బోర్డుకు ఆ నిబంధనలను వర్తింపజేస్తున్నట్లు పేర్కొన్నారు. బోర్డులో ఉండాల్సిన ఎక్స్ అఫిషియో సభ్యులు, నామినేటెడ్ సభ్యులు, కో-ఆప్టెడ్ సభ్యులు, వైస్ చైర్మన్ పదవులకు నియమించే వారి బాధ్యతలను వివరించారు.
ఇదీ బోర్డు స్వరూపం..: విద్యాశాఖ మంత్రి చైర్మన్‌గా వ్యవహరించే తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డులో ఎక్స్ అఫిషియో సభ్యులుగా 10 మంది ఉంటారు. అందులో విద్యాశాఖ కార్యదర్శి, కళాశాల విద్య కమిషనర్ అండ్ డెరైక్టర్, పాఠశాల విద్య కమిషనర్ అండ్ డెరైక్టర్, ఇంటర్ విద్య కమిషనర్ అండ్ డెరైక్టర్, సాంకేతిక విద్యా డెరైక్టర్, మెడికల్ సర్వీసెస్ డెరైక్టర్, ఇండ స్ట్రీస్ డెరైక్టర్, అగ్రికల్చర్ డెరైక్టర్, తె లుగు అకాడమీ డెరైక్టర్, కార్యదర్శి ఉంటారు. అలాగే ఆర్థిక శాఖ నుంచి ఒకరు, రాష్ట్రంలోని ఒక్కో యూనివర్సిటీ నుంచి ఒక్కొక్కరిని, ఏదైనా డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ ఒకరిని సభ్యులుగా నామినేట్ చేస్తారు. మరో ఆరుగురిని గుర్తింపు పొందిన, అనుబంధ జూనియర్ కాలేజీల నుంచి, ప్రైవేటు కాలేజీల నుంచి, మహిళ జూనియర్ కాలేజీల నుంచి నియమిస్తారు. బోర్డు నిబంధనల ప్రకారం విషయ నిపుణులు ముగ్గురిని కో-ఆప్టెడ్ సభ్యులుగా నియమిస్తారు. బోర్డు సభ్యుల్లో ఒకరిని వైస్ చైర్మన్‌గా నియమిస్తారు. పాలనాపరమైన అంశాలతో పాటు అన్నింటిలో చైర్మన్‌కు వైస్ చైర్మన్ సహకారం అందించాల్సి ఉంటుంది. చైర్మన్ లేనపుడు వైస్ చైర్మన్ విధులు నిర్వర్తిస్తారు.
ఉద్యోగుల హర్షం..
బోర్డు ఏర్పాటు ఉత్తర్వులు జారీ కావడంతో ఇంటర్మీడియట్ బోర్డులోని తెలంగాణ ఉద్యోగులు, అధికారులు పెద్దఎత్తున సంబురాలు జరుపుకున్నారు. ఉద్యోగులు ఒకరికి ఒకరు స్వీట్లు పంచుకొని బాణసంచా పేల్చారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ విద్యా జేఏసీ కన్వీనర్ మధుసూదన్‌రెడ్డి, బోర్డు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి, అధికారుల సంఘం అధ్యక్షుడు భీంసింగ్, ప్రిన్సిపాళ్ల సంఘం అధ్యక్షుడు అంజన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బోర్డు ఏర్పాటైనందున ఏపీతో సంబంధం లేకుండా తెలంగాణలో వేరుగానే పరీక్షలు జరుగుతాయని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Advertisement