సాక్షి, అమరావతి: ఇటీవల ఆగస్టులో కురిసిన భారీ వర్షాలు, సెప్టెంబర్‌లో సంభవించిన వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చాలామంది తమ సర్టిఫికెట్లు కోల్పోయారు. ఇలాంటి వారికి ఉచితంగా సర్టిఫైడ్ కాపీలు/ డూప్లికేట్ సర్టిఫికెట్లు అందించాలని ఇంటర్ విద్యా మండలి నిర్ణయించినట్లు ఇంటర్ విద్య కార్యదర్శి కృతికా శుక్లా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అంశంపై వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆర్‌ఐవోలు, డీఐఈవోలు విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. అభ్యర్థులు వారు చదువుకున్న కాలేజీ ప్రిన్సిపల్, జిల్లా అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని, లేదా నేరుగా బోర్డు అధికారులను గాని సంప్రదించాలని సూచించారు.
పదో తరగతి హిందీ సిలబస్ కుదింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 1,000 ప్రభుత్వ సీబీఎస్‌ఈ స్కూళ్లను ప్రభుత్వం స్టేట్ సిలబస్‌లోకి మార్చిన నేపథ్యంలో ఆయా స్కూళల్లో సిలబస్‌ను నవంబర్ 30లోగా పూర్తి చేయాలని పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారు. పదో తరగతి విద్యార్థులకు ఎస్సెస్సీ బోర్డు పరీక్షలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా హిందీ సిలబస్ అధికంగా ఉన్న నేపథ్యంలో కొన్ని చాప్టర్లను తొలగిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఈ స్కూళ్ల విద్యార్థులకు జూన్– జూలై సిలబస్‌తో ఎఫ్‌ఏ–1 హిందీ నమూనా పరీక్షను మంగళవారం పూర్తి చేశామని తెలిపారు. అలాగే, కొత్త విధివిధానాల ప్రకారం పదో తరగతి విద్యార్థులకు హిందీ సిలబస్ అధికంగా ఉన్నందున పద్యభాగ్–7 (ఆత్మత్రాణ్), గద్యభాగ్–11 (తీసరీ కసమ్ కే వశల్ పకార్ శేలేంద్ర), గద్యభాగ్–12 (అబ్ కహా దూస్‌రోంకే దుఖ్ సే దుఖీ హోనీవాలీ), ఉపవాచక్–3 (టోపీ శుక్లా) పాఠాలను తొలగిస్తున్నట్టు తెలిపారు.
కేఎల్‌యూ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష పోస్టర్ విడుదల
తాడేపల్లిరూరల్ : గుంటూరు జిల్లా వడ్డేశ్వరం కేఎల్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ క్యాంపస్‌లలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశ నిమిత్తం జాతీయస్థాయిలో నిర్వహించనున్న ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష 2025 పోస్టర్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష, విద్యావిధానం, మెరిట్ విద్యార్థులకు ఇచ్చే రాయితీలు, స్కాలర్‌షిప్ విధానం గురించి యూనివర్సిటీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.
యూనివర్సిటీ ప్రో చాన్సలర్ డాక్టర్ జగన్నాథరావు, వైస్ చాన్సలర్ డాక్టర్ పార్థసారథి వర్మ, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె. శ్రీనివాసరావు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. డాక్టర్ పార్థసారథి వర్మ మాట్లాడుతూ యూనివర్సిటీ అందించే ఇంజినీరింగ్ కోర్సులకు మొదటి విడత ప్రవేశ పరీక్షను డిసెంబర్ 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment