
న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ బోర్టు పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఢిల్లీ మెట్రో శుభవార్త తెలిపింది. ఈరోజు (ఫిబ్రవరి 15)నుంచి సీబీఎస్‌ఈ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఢిల్లీ మెట్రో ప్రత్యేక వెసులుబాటు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అయితే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అడ్మిట్ కార్డులను మెట్రో స్టేషన్ సిబ్బందికి చూపించాలని తెలియజేసింది.
ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) తెలిపిన వివరాల ప్రకారం పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు టికెట్ ఆఫీస్ మెషీన్స్ (టీఓఎం), కస్టమర్ కేర్ (సీసీ) కేంద్రాలలో టిక్కెట్లు కొనుగోలు చేసేటప్పుడు వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపింది. రద్దీ సమయంలో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవడానికి వీలుగా వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని ఢిల్లీ మెట్రో పేర్కొంది.
ఫిబ్రవరి 15 నుండి ఏప్రిల్ 4 వరకు జరిగే పరీక్షలకు ఢిల్లీకి చెందిన 3.30 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరి ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ఢిల్లీ మెట్రో ఈ నిర్ణయం తీసుకుంది. ఇదేవిధంగా పరీక్షలు జరిగే రోజుల్లో రద్దీని నియంత్రించేందుకు మెట్రో స్టేషన్లలో సీఐఎస్‌ఎఫ్ సహకారంతో ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తున్నట్లు ఢిల్లీ మెట్రో తెలిపింది.
ఇది కూడా చదవండి: Mahakumbh: 1,100 కి.మీ పరుగు.. కుంభమేళాకు అగ్నివీర్