రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్ల విజేతలపై నేడు మధ్యాహ్ననికి స్పష్టత
ఉదయం 8కి పోస్టల్ బ్యాలెట్, 8.30కు ఈవీఎం ఓట్ల కౌంటింగ్ ప్రారంభం
రాష్ట్రంలోని 34 ప్రాంతాల్లో మొత్తం 139 కౌంటింగ్ హాళ్లు సిద్ధం
ఉదయం 10.30 గంటలకల్లా ట్రెండ్స్ తెలిసే అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏ పార్టీ ఎన్ని లోక్‌సభ సీట్లు సాధిస్తుందన్న ఉత్కంఠకు కొన్ని గంటల్లో తెరపడనుంది. మంగళవారం ఉదయమే ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. ఈ మేరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ ప్రకటించారు. గత నెల 13న రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు సాధారణ ఎన్నికలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన విషయంతెలిసిందే. కంటోన్మెంట్ సీటు ఓట్లను సైతం మంగళవారం లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. మొత్తంగా 525 మంది అభ్యర్థులు పోటీపడగా.. 2,18,14,025 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 65.67శాతం పోలింగ్ నమోదైంది.
అత్యధికంగా 24 రౌండ్లలో లెక్కింపు..
లోక్‌సభ ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 34 ప్రాంతాల్లో.. మొత్తం 139 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. ఇందులో 120 హాళ్లలో ఈవీఎం ఓట్లు, 19 హాళ్లలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఒక కౌంటింగ్ హాల్ ఉంటుంది. ఒక్కో హాల్‌లో 24 టేబుల్స్ ఉంటాయి. మహేశ్వరం స్థానం పరిధిలో 28 టేబుల్స్ ఏర్పాటు చేయాల్సి రావడంతో రెండు హాళ్లలో ఓట్లను లెక్కించనున్నారు.
దీంతో ఈవీఎం ఓట్ల కౌంటింగ్ హాళ్ల సంఖ్య 120కి పెరిగింది. మొత్తం 10వేల మంది సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొననున్నారు. చొప్పదండి, యాకూత్‌పుర, దేవరకొండ అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలైన లోక్‌సభ ఓట్లను అత్యధికంగా 24 రౌండ్లలో లెక్కించనున్నారు. ఆర్మూరు, భద్రాచలం, అశ్వారావుపేట అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలైన ఓట్లను అత్యల్పంగా 13 రౌండ్లలో లెక్కిస్తారు. చాలా స్థానాల పరిధిలో 18 నుంచి 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తికానుంది.
రౌండ్ల వారీగా ఫలితాల ప్రకటన..
ఒక్కో టేబుల్ వద్ద ఒక మైక్రో అబ్జర్వర్, ఒక ఏఆర్‌ఓ, ఇద్దరు సహాయకులు, అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు. ప్రతి రౌండ్ ఓట్ల లెక్కింపును మైక్రో అబ్జర్వర్ పర్యవేక్షిస్తారు. ఏకకాలంలో అన్ని టేబుళ్లలో నిర్వహించే లెక్కింపును ఒక రౌండ్‌గా పరిగణిస్తారు. అలా రౌండ్ల వారీగా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ప్రతి రౌండ్ వివరాలను కేంద్రం నుంచి వచి్చన పరిశీలకుడి పరిశీలనకు పంపిస్తారు. పరిశీలకుల ఆమోదం తర్వాత తదుపరి రౌండ్ లెక్కింపును ప్రారంభిస్తారు. అదే సమయంలో ఒక్కో రౌండ్ లెక్కింపు పూర్తయిన కొద్దీ.. స్థానిక ఆర్వో/ఏఆర్వో మీడియా రూమ్ వద్దకు వచ్చి ఫలితాలను ప్రకటిస్తారు.
రౌండ్ల వారీగా ఫలితాలపై ఫారం–17సీ మీద కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు. ప్రతి శాసనసభ స్థానం పరిధిలో ర్యాండమ్‌గా ఐదు పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసి.. ఈవీఎంలలోని ఓట్లను, వీవీ ప్యాట్ స్లిప్పులను సరిపోల్చి చూస్తారు. ఎన్నికల ఫలితాలను ప్రదర్శించడానికి 78 ప్రాంతాల్లో స్క్రీన్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఎన్నికల సంఘం అనుమతి ఉన్న వ్యక్తులను మాత్రమే రానిస్తారు.
నేడు మద్యం షాపులు బంద్
లోక్‌సభ ఓట్ల లెక్కింపు నేపథ్యంలో మంగళవారం రోజున తెలంగాణలో మద్యం దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఇక ఫలితాలు వచి్చన తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి అనుమతి లేదు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పోలీసులు ముందుగా అనుమతిస్తే ర్యాలీలు చేసుకోవచ్చు.
ఉదయం 10.30 కల్లా ఆధిక్యతపై స్పష్టత!
మంగళవారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. 2.18లక్షల పోస్టల్ బ్యాలెట్లు పోలైన నేపథ్యంలో లెక్కింపునకు ఎక్కువే సమయం పట్టే అవకాశం ఉంది. ఇక 8.30 గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఉదయం 10.30 గంటల కల్లా చాలా లోక్‌సభ స్థానాల్లో ఎవరు ఆధిక్యతలో ఉన్నారనేది తేలే అవకాశం ఉంది. మధ్యాహ్నం 12.30 గంటలకల్లా విజయావకాశాలపై స్పష్టత వచ్చే చాన్స్ ఉంది. పోటీ ఎక్కువగా ఉన్న స్థానాల్లో మాత్రం ఆద్యంతం ఉత్కంఠగా కౌంటింగ్ కొనసాగనుంది. కౌంటింగ్, ఫలితాల సరళిని https://results.eci.gov.in ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment