- నాకే ఇవ్వాలంటున్న విద్యాశాఖ ఏడీ
- బోధనేతరులకు ఇవ్వొద్దంటున్న గెజిటెడ్ హెడ్మాస్టర్లు
- కలెక్టర్ వద్దకు చేరిన పంచాయతీ
ఉపవిద్యాశాఖాధికారి పోస్టుకు పోటాపోటీ
Published Thu, Sep 15 2016 12:08 AM | Last Updated on Thu, Oct 4 2018 5:35 PM
ఖమ్మం : ఖమ్మం ఉప విద్యాశాఖాధికారి పోస్టుకు పోటాపోటీగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ పోస్టు తనకే ఇవ్వాలని విద్యాశాఖ ఏడీ నాగేశ్వరరావు పట్టుపడుతుండగా.. బోధనేతరులకు కాకుండా సీనియర్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకే ఇవ్వాలని ఆ సంఘం నాయకులు కోరుతున్నారు. ఇప్పటివరకు విద్యాశాఖకే పరిమితమైన ఈ వివాదం బుధవారం జిల్లా కలెక్టర్ వద్దకు చేరింది. పలువురు సీనియర్ గెజిటెడ్ ఉపాధ్యాయులు జిల్లా కలెక్టర్‌ను కలిసి తమకే డిప్యూటీ ఈఓ ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించాలని కోరారు. ఖమ్మం ఉప విద్యాశాఖాధికారిగా పనిచేసిన ఆదినారాయణమూర్తి పదవీ విరమణ పొందడంతో ఆ బాధ్యతలు డైట్ కళాశాల అధ్యాపకుడు బస్వారావుకు అప్పగించారు. ఈ నేపథ్యంలో 2013లో డిప్యూటీ ఈఓల భర్తీకోసం ప్రయత్నాలు చేసి పలువురు సీనియర్ గెజిటెడ్ ఉపాధ్యాయులను నియమించారు. అయితే వారి నియామకం సక్రమంగా లేదని ఆ నియామకాలను రద్దు చేశారు. జనవరిలో పదవీ విరమణ పొందుతున్న బస్వారావుకు ఇటీవల డైట్ కళాశాల ప్రిన్సిపాల్ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే కళాశాల అధ్యాపకుడిగా,ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ఆయన ఖమ్మం ఉప విద్యాశాఖాధికారి బాధ్యతలు చేయలేనని, తనను ఈ బాధ్యతలనుంచి తప్పించాలని పలుసార్లు విజ్ఞప్తిచేశారు. ఈక్రమంలో సమాన కేడర్‌గా పనిచేస్తున్న తనకు డిప్యూటీ ఈఓకు కావాల్సిన అర్హతలన్నీ ఉన్నాయని, బీఈడీ సర్టిఫికెట్ ఉందని తెలుపుతూ విద్యాశాఖ ఏడీ నాగేశ్వరరావు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రయత్నాలు కొద్ది రోజులుగా కొనసాగుతుండగా.. రెండు, మూడు రోజులుగా ఈ ఫైల్ కలెక్టర్ కార్యాలయానికి చేరిందని వార్తలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన జిల్లా గెజిటెడ్ ప్రధానోపాద్యాయుల సంఘం నాయకులు వీరస్వామి కలెక్టర్‌ను కలిసి డిప్యూటీ ఈఓ పోస్టును సీనియర్ గెజిటెడ్ ఉపాధ్యాయులకే ఇవ్వాలని కోరారు. ఖమ్మం అర్బన్‌మండలం కోయచెలక ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి, చర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాద్యాయురాలు నీరజ వేర్వేరుగా కలెక్టర్లను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఎటూ తేల్చుకోలేని విద్యాశాఖాధికారి..
డిప్యూటీ ఈఓ పోస్టు భర్తీకి ఏ విధమైన నిబంధనలు పాటించాలనే విషయంపై జిల్లా విద్యాశాఖాధికారి ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. ఒకవైపు కార్యాలయంలోని ఏడీ ముమ్మర ప్రయత్నాలు చేయడం.. మరోవైపు గెజిటెడ్ ఉపాధ్యాయుల నుంచి ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో ఆ పోస్టులో బస్వారావునే కొనసాగిస్తూ ఇంతకాలం నెట్టుకొచ్చారు. అయితే ఇటీవల బస్వారావు తాను పనిచేయలేనని చేతులెత్తేయడం, ఇరువర్గాలనుంచి ముమ్మర ప్రయత్నాల నేపథ్యంలో ఉన్నతాధికారుల సూచనల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిసింది.
Advertisement
Advertisement