జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయం
నామినేటెడ్ పోస్టుకు ఊపందుకున్న పైరవీలు
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవికి తీవ్ర పోటీ
ఇదే అదనుగా క్యాష్ చేసుకుంటున్న కీలక నేత
రూ. 20లక్షలకు దాటిపోయిన రేటు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఆ పదవికి ఆర్థిక ప్రయోజనాలేం ఉండవు. అలా అని తీసిపారేయడానికి లేదు. రాజకీయంగా ఎదుగుదలకు ఓ అవకాశం ఉంది. అందుకే ఆ పదవికోసం ఇప్పుడు గట్టిపోటీ ఏర్పడింది. నామినేటెడ్ పదవుల్లో కీలకమైన ఈ పదవికోసం అప్పుడే లక్షలాదిరూపాయలు చేతులు మారినట్టు సమాచారం. పోటీకి అనుగుణంగా... ఓ ప్రముఖుడు ఎంచక్కా క్యాష్ చేసుకుంటున్నాడు. పోటీదారుల ఆరాటాన్ని ఆసరాగా చేసుకుని అందరినుంచీ పెద్ద మొత్తంలో గుంజేస్తున్నాడు. జిల్లాలోని నామినేటేడ్ పదవుల్లో కీలకమైనది జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి. ఇప్పుడీ పోస్టు కోసం టీడీపీ నేతల్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పైరవీలు ఊపందుకున్నాయి. దాని వల్ల ఆర్థిక ప్రయోజనాల కన్నా రాజకీయంగా మైలేజ్ వస్తుందని, భవిష్యత్ రాజకీయాలకు రాచబాట అనే ఉద్దేశంతో టీడీపీ నేతలు పోటీపడుతున్నారు. ఇదే అవకాశంగా తీసుకుని ఎవరెక్కువ ఇస్తే వారికే గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి కట్టబెట్టేందుకు కీలక నేతొకరు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏఎంసీ, ఆర్‌ఈసీఎస్, దేవాలయాల కమిటీలను మాత్రమే భర్తీ చేశారు. వీటి భర్తీలో పలుచోట్ల పెద్ద ఎత్తున మొత్తాలు చేతులు మారాయి. కాకపోతే, నియోజకవర్గాల స్థాయిలోనే ఒప్పందాలు జరిగిపోయాయి. ఆ దిశగానే నియామకాలు జరిగాయి. కానీ, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి మాత్రం నేటికీ భర్తీ చేయలేదు. ఇదిగో అదిగో అంటూ వాయిదా వేస్తున్నారు. దీని కోసం ఎయిమ్స్ విద్యా సంస్థల అధినేత కడగల ఆనంద్‌కుమార్, గజపతినగరం నాయకుడు రావెల శ్రీధర్, పార్వతీపురం నాయకులు దేవరకోటి వెంకటనాయుడు, గొట్టాపు వెంకటనాయుడు తదితరులు మొదటి నుంచి ఆశిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలోకి టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు కూడా చేరినట్టు సమాచారం.
ఇప్పటికే రూ. 20లక్షలకు దాటింది
జిల్లా స్థాయి పదవి కావడంతో ప్రోటోకాల్ ఉంటుందని, భవిష్యత్ రాజకీయాలకు దోహదపడుతుందనే ఉద్దేశంతో ముగ్గురు తీవ్రంగా పోటీ పడుతున్నారు. దీన్ని ఆవకాశంగా తీసుకుని కీలక నేతొకరు క్యాష్ చేసుకుంటున్నారు. వారిలో ఒకరు ఆయనకు తొలి విడతగా రూ. 10లక్షల వరకు ముట్టజెప్పినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. మరొకరు రూ. 5లక్షలు ఇచ్చారని తెలుస్తోంది. ఇంకొకరు ఆ నేతకయ్యే విమాన చార్జీలను భరిస్తున్నట్టు తెలిసింది. ఎవరెంత ముట్టజెప్పినప్పటికీ రోజురోజుకూ పెరుగుతున్న పోటీ ఆయనలో ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఇదే అదనుగా ఆశావహుల మధ్య రేటు పెంచేస్తున్నట్టు తెలుస్తోంది. అంతర్గతంగా జరిగిన సంప్రదింపుల ప్రకారం ఇప్పటివరకు ఆ రేటు రూ. 20లక్షలకు వెళ్లినట్టు పార్టీలో గుసగుసలు విన్పిస్తున్నాయి. రూ. 30లక్షల నుంచి రూ. 40లక్షల వరకు వస్తే తప్ప కీలక నేత సానుకూలంగా స్పందించేలా లేరని తెలుస్తోంది.
సీనియారిటీపైనే ఇద్దరి ఆశలు
కాసులతో పదవి కొట్టేయాలని కొందరు యత్నిస్తుంటే ఓ ఇద్దరు మాత్రం సీనియారిటీనే ప్రాతిపదికగా పదవి కొట్టేయాలని పావులు కదుపుతున్నారు. రాష్ట్ర స్థాయిలో నామినేటేడ్ చైర్మన్ పదవితో బుగ్గకారులో తిరగొచ్చని కొన్నాళ్లు ఆశ పడిన నేత కాలక్రమంలో ఎమ్మెల్సీ పోస్టును ఆశించారు. అదీ దక్కకపోవడంతో ఇప్పుడీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేసులోకి వచ్చారు. నిన్న కాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన నాయకులకు, పార్టీలు మారి వచ్చిన నేతలకు పెద్ద పీట వేస్తున్నారని తమకు కనీసం ఈ పోసై్టనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే తరహాలో మరో నేత కూడా పార్టీకి అందించిన చిరకాల సేవలను దష్టిలో ఉంచుకుని చైర్మన్ పదవి ఇవ్వాలని కోరుతున్నారు.