పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి శాంతినగర్‌లో లంచం తీసుకుంటూ వీఆర్వో పట్టుబడ్డ సంఘటనలో ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న 16 పట్టాదార్ పాసు పుస్తకాల్లో 12 బోగస్‌వేనని తేలిందని పెద్దపల్లి తహసీల్దార్ అనుపమ తెలిపారు. శుక్రవారం కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. 12 పాసు పుస్తకాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరిట ఉన్నాయని, సీరియల్ నెంబర్లు కూడా ఎక్కడివో తెలియవని అన్నారు. వాటికీ, కార్యాలయ రికార్డులకు పొంతన లేదన్నారు. ఆ పాసు పుస్తకాలపై 2009 నుంచి 2011వరకు పనిచేసిన తహసీల్దార్ మక్మూర్‌అలీ సంతకాలు ఉన్నాయన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి వాస్తవాలు తేల్చేందుకు పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. నకిలీ పాసుపుస్తకాలను కూడా పోలీసు అధికారులకు అప్పగిస్తున్నామని చెప్పారు. సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దని రైతులను కోరారు. సమావేశంలో డెప్యూటీ తహసీల్దార్ సదానందం, సమ్మయ్య ఉన్నారు.