12 గంటల్లో కిడ్నాప్ కేసు ఛేదింపు
అనంతపురం సెంట్రల్ : చిన్నారి కిడ్నాప్ కేసును 12 గంటల వ్యవధిలోనే ఛేదించారు. సీసీ కెమెరాల ఆధారంగా కిడ్నాపర్‌ను కనుగొని, అతడి నుంచి చిన్నారికి విముక్తి కల్పించారు. అతడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కు పంపారు. డీఐజీ ప్రభాకర్‌రావు, ఎస్పీ ఎస్.వి.రాజశేఖరబాబు సమక్షంలో చిన్నారిని తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను వారు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. అనంతపురంలోని సూర్యనగర్ సర్కిల్ సమీపంలో నివాసముంటున్న కిశోర్‌కుమార్, మల్లీశ్వరి దంపతుల మూడేళ్ల కుమార్తె హనీశ్వరి గురువారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు ఇంటి పరిసరాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో వన్‌టౌన్ సీఐ రాఘవన్, ఎస్‌ఐ రంగడుయాదవ్‌లను ఆశ్రయించారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇంటి పరిసరప్రాంతాలను క్షుణ్ణంగా గాలించారు. అనంతరం సీసీ కెమెరాలను పరిశీలించారు. గురువారం సాయంత్రం 6.30 గంటల సమయంలో బాలికను కిడ్నాప్ చేసి బస్సు ఎక్కుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. బస్సు నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టగా.. కిడ్నాపర్ ధర్మవరం పట్టణంలోని కళాజ్యోతిసర్కిల్‌లో దిగి ఆటో ద్వారా వెళ్లినట్లు తేలింది. వెంటనే ఆటోడ్రైవర్ అడ్రస్సు కనుగొని కిడ్నాపర్‌ని పట్టుకున్నారు. ఇదంతా 12 గంటలలోపే జరిగింది. ధర్మవరం పట్టణంలోని మార్కెట్ వీధికి చెందిన పెన్నోబిలేసు అనే వ్యక్తి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు నిర్దారించారు. నిందితున్ని అదుపులోకి తీసుకొని చిన్నారి హనీశ్వరిని సురక్షితంగా జిల్లా కేంద్రానికి తీసుకొచ్చారు. శుక్రవారం ఉదయం పోలీసు పరేడ్ మైదానంలో డీఐజీ ప్రభాకర్‌రావు, ఎస్పీ రాజశేఖరబాబుల సమక్షంలో చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రులకు చేర్చడంలో కృషిచేసిన వన్‌టౌన్ సీఐ రాఘవన్, ఎస్‌ఐ రంగడుయాదవ్, సిబ్బందిని అభినందించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపుతున్నామన్నారు. పిల్లలు లేరని, పెంచుకునేందుకే తీసుకెళ్లానని నిందితుడు పోలీసుల విచారణలో చెప్పాడు.