అమ్మాయిలు సప్లయ్ చేస్తాడంటూ..
- కక్షసాధింపునకు వికృత చర్యలు
- స్నేహితుల మధ్య పొడచూపిన విభేదాలు
- తప్పుడు ప్రచారంతో స్టిక్కర్ల అతికింపు
అమలాపురం : వారిద్దరూ ఒకే గ్రామానికి చెందిన స్నేహితులు. ఇద్దరి మధ్య అమ్మాయిల విషయమై వివాదం ఏర్పడింది. ఇద్దరి మధ్య కక్షలు పెరిగాయి. కక్ష సాధింపునకు ఇద్దరూ వేచి ఉన్నారు. ఓ స్నేహితుడు తన శత్రువుపై మరీ అడ్డదారులు తొక్కి వికృత చర్యలకు పాల్పడ్డాడు. ‘రిసార్ట్స్‌లో అమ్మాయిలు సప్లయ్ చేయబడును, అంటూ వివరాలకు తన శత్రువు పేరు రాసి ... అతడి ఫోన్లు నెంబర్లతో ఫ్లెక్సీల మాదిరిగా స్టిక్కర్లు ముద్రించి కోనసీమలోని బస్‌స్టేషన్లు, ముఖ్య కూడళ్లలో అతికించిన విషయం వివాదాస్పదమైంది. పోలీసు కేసులు, నిందితుల అదుపు వరకూ పరిస్థితులు దారి తీశాయి.
సంబంధిత వివరాలను పట్టణ సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం కె. ఏనుగపల్లికి చెందిన బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న బోణం సాయిరామ్, నిమ్మకాయల శేషయ్య మధ్య తలెత్తిన వివాదం ఈ తప్పుడు స్టిక్కర్లతో అవాక్కయ్యే ప్రచారాలకు ఒడిగట్టారు. ఒకరినొకరు విష ప్రచారానికి తెర తీసుకున్నారు. చివరకు అమలాపురం బస్‌స్టేషన్‌లో అతికించి ఉన్న ఈ స్టిక్కర్‌ను సీఐ శ్రీనివాస్ గమనించి వీటి వెనుక ఉన్న రెండు వర్గాల స్నేహితుల బృందాల మధ్య జరుగుతున్న వార్‌గా గుర్తించారు.
దీనిపై లోతుగా దర్యాప్తు చేసిన సీఐ తీగ లాగితే డొంక కదలినట్లు రెండు స్నేహితులు బృందాలకు చెందిన పేర్లను సేకరించి వారిని మంగళవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బోణం సాయిరామ్ నాయకత్వంలో దాసరి అయ్యప్పనాయుడు బోణం ప్రసాద్, తోలేటి అరవింద్, కుంపట్ల సాయిరామ్‌లను, నిమ్మకాయల శేషయ్య నాయకత్వంలోని చేగొండి సాయిరామ్ తదితరులను పోలీ సులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీఐ శ్రీనివాస మాట్లాడుతూ ఆ రెండు వర్గాలకు సంబంధించిన వారు పరస్పరం ఇలాంటి వికృత చేష్టలకు ఒడిగట్టారని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.