'కాంగ్రెస్, టీడీపోళ్లు తోడు దొంగలు'
మెదక్(దుబ్బాక): ‘రైతుల కష్టాలు, బాధలు తెలిసినోళ్లం.. రైతుల కన్నీళ్లను తుడవడానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోంది.. అయితే తోడు దొంగలుగా మారిన టీడీపీ, కాంగ్రెస్ వాళ్లు ఓర్వలేక రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటున్నార’ని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. ఆదివారం మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి, తొగుట మండలం జప్తిలింగారెడ్డి పల్లిలో నూతనంగా నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి ఎకరాలకు కాల్వల ద్వారా సాగు నీరందించి, ఆగమవుతున్న అన్నదాతలను ఆదుకోవడానికి ప్రణాళిక బద్దంగా కేసీఆర్ ప్రభుత్వం ముందుకెళుతోందన్నారు.
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు కలిసి సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాలకే సాగు, తాగు నీరందిస్తారా అంటూ దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడి ప్రాంత టీడీపీ, కాంగ్రెసోళ్లకు చీము నెత్తురుంటే వారిని నిలదీయాలని పిలుపు నిచ్చారు. రూ. 25 వేల కోట్లతో 48 వేల చెరువులను మిషన్ కాకతీయ కింద మరమ్మతులు చేపట్టి గోదావరి నీళ్లతో చెరువులను నింపి, అన్నదాతల ఆశలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వంపై ప్రతి పక్షాలు అవాకులు, చెవాకులు పలుకుతున్నాయని ఆరోపించారు. పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని రైతులంతా కలిసి శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపడితే ఆకారణంగా ముగ్గురు రైతులను పొట్టన పెట్టుకున్న చరిత్ర టీడీపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు.