మోదీ దేశ ప్రతిష్ట దిగజార్చారు
సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి
జగిత్యాల రూరల్: పెద్దనోట్లు రద్దు చేసి ప్రధాన మంత్రి మోదీ దేశ ప్రతిష్టను దిగజార్చారని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి మండిపడ్డారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నల్లకుబేరులను బయటకు తీస్తామని వాగ్దానం చేసిన ప్రధాని కోట్లాది రూపాయలు రుణాలు ఎగవేసిన వారికి వత్తాసు పలికారన్నారు. పేద ప్రజలను రోడ్డుకీడ్చారని, పెద్దనోట్ల రద్దును కప్పిపుచ్చుకునేందుకు క్యాష్‌లెస్ లావాదేవీలు అని, బంగారం నియంత్రణ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని మోదీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. సామాన్యుల వద్దనున్న డబ్బును బ్యాంకుల్లో జమ చేయించి ప్రభుత్వం కరెన్సీ వినియోగం తేవడానికి ప్రత్యామ్నాయ నోట్ల ముద్రణ చేయకుండా ప్రజలను ఇబ్బం దులకు గురిచేస్తున్నారన్నారు.
ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే..
ఇప్పటికే యూపీఏ ప్రభుత్వంలో రైతులకు లక్షలోపు రుణాలకు కేంద్ర ప్రభుత్వం నాలుగు శాతం, రాష్ట్ర ప్రభుత్వం మూడు శాతం వడ్డీ మాఫీ చేస్తుందని దేశంలో ఉన్న రైతాంగాన్ని తప్పుదోవ పట్టించేందుకే రెండు మాసాలు వడ్డీ మాఫీ చేస్తామనడం మోసపూరిత ప్రకటననే అన్నారు. అసలు బ్యాంకర్లు రుణాలే ఇవ్వని పరిస్థితిలో గృహ రుణాల వడ్డీ తగ్గిస్తున్నామని చెప్పుకోవడం సబబు కాదన్నారు. 50 రోజులు గడుస్తున్నా ఏటీఎంలు కూడా పనిచేయడం లేదని అన్నారు. పెళ్లిళ్ల కోసం రూ.2.50 లక్షలు నగదు చెల్లిస్తామని ప్రధాని వాగ్దానం చేసినా ఇప్పటి వరకు ఏ పెళ్లికి డబ్బులు ఇచ్చిన దాఖలా లేదన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ, బీజేపీ నాయకులు గాలి జనార్దన్‌రెడ్డి ఇంట్లో వివాహాలకు మాత్రం పెద్ద ఎత్తున నగదు ఎలా లభ్యమయ్యాయని ఆయన ప్రశ్నించారు.
నగదు దొరకక ఈజీఎస్ కూలీలు, గ్రామీణ ప్రాంత ప్రజలు అల్లాడుతున్నారని, కేంద్ర ప్రభుత్వం కొత్తనోట్ల సరఫరా చేయడంలో ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకమొత్తంలో రుణమాఫీ సాధ్యం కాదని, ప్రస్తుతం 12.50 శాతం రుణమాఫీ జమచేశామని చెబుతున్నా, ఏ ఒక్క బ్యాంక్ నుంచి రైతుకు డబ్బులు అందిన దాఖలు లేవన్నారు. గతంలో సమగ్ర కుటుంబ సర్వే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులు ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టిందని, అది పెన్షన్ల తొలగింపునకు మాత్రమే అక్కరకు వచ్చిందన్నారు.
శ్వేతపత్రం విడుదల చేయాలి
ఇప్పటి వరకు రద్దు అయిన నోట్లతో దేశంలో ఎంతో సొమ్ము వచ్చిందని, రాలేకపోయిన సొమ్ము ఎంతో వివరిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెద్దనోట్ల రద్దుతో ప్రజలను ఉపాధికి దూరం చేశారని, ప్రతి పేద కుటుంబానికి రూ.25వేలు వారి ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. నోట్ల రద్దుతో దేశంలో 150 మంది మరణించారని, వారి కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి, ఎంపీపీ గర్వందుల మానస, వైస్ ఎంపీపీ గంగం మహేశ్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బండ శంకర్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గర్వందుల నరేశ్‌గౌడ్, ముఖేశ్‌కన్నా,రాజేందర్ పాల్గొన్నారు.
అటవీశాఖ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారుల దాడులు
సారంగాపూర్: సారంగాపూర్ మండలంలోని నాగునూర్ గ్రామంలో సోమవారం అటవీశాఖ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు దాడులు నిర్వహించారు. కొంతమంది రైతుల ఇళ్లలో అక్రమంగా కలప నిలువ ఉందనే సమాచారం మేరకు అధికారులు దాడులు నిర్వహించి దాచి ఉంచిన కలపను పట్టుకున్నారు. కార్యక్రమంలో అటవీశాఖ రేంజర్ ఖలీల్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.