
‘ఫేటు’ మారిందా ... సీటు గోవిందా
ఈ మధ్య కాంగ్రెస్ నాయకుడొకరు మాటిమాటికి తెలంగాణ ప్రభుత్వంపై ఒంటి కాలిపై లేస్తున్నారు. ప్రచారమే పరమావధిగా పెట్టుకున్న ఆయన సొంత పార్టీ నాయకులను సైతం వెనక్కి నెట్టి దూకుడు మీదున్నారు. సదరు నేత స్పీడ్‌కు బ్రేక్ వేయాలని గులాబీ దళపతి పన్నిన వ్యూహానికి కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ‘‘మళ్ల మండలిలో నేను కాలుబెట్టే వరకు ఆ నాయకుడు.. ఆ సీట్లో ఉండొద్దు. ఏందయ్యా ప్రతీ దాంట్లో వేలు పెడుతుండు. ఇష్టమున్నట్లు మాట్లాడుతుండు. మీరేం చేస్తరో నాకు తెల్వదు..’’ అంటూ గులాబీ నేత హుకుం జారీ చేశారట! ఈ ముచ్చట తెలిసి ఆ నాయకుడు యమ హైరానా పడుతున్నాడట. గులాబీ పార్టీ నాయకులు ఏం ప్లాన్ చేస్తున్నారంటూ సదరు కాంగ్రెస్ నేత పీఏలు, పీఆర్వోలు తమకు తెలిసిన విలేకరులందరినీ వాకబు చేయడం మొదలు పెట్టారు. ఇంతకూ ఏం సీటు.. మారబోతోందని ఆరా తీసినోళ్లకు గులాబీ నేతలు దిమ్మ తిరిగే సమాధానం చెబుతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్‌తో మండలిలో కాంగ్రెస్ శిబిరంలో సగానికి పైగా ఖాళీ చేసే పనిలో ఉన్నారని సమాచారం.
ఇప్పటికే ఓ సభ్యుడు గులాబీ గూటిలో సర్దుకున్నారు. మరో ముగ్గురు గట్టు దాటితే చాలు ప్రతిపక్ష హోదా ఢమాల్. ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు గులాబీ తీర్థం పుచ్చుకోవడానికి తలలూపారట. ఇంకే ముంది.. ఇంకొక్కరు గోడ దూకితే చాలు. వీరి భుజాల మీద గులాబీ కండువాలు కప్పించేందుకు కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం పనిచేసి అధికార పార్టీ పంచన చేరిన ఓ సీనియర్ నేత చక్రం తిప్పుతున్నారని గుసగుసలు గుప్పుమంటున్నాయి. ఒకవేళ ఇదే జరిగిందా... నూటా ముప్పై వసంతాల వయసు దాటిన కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా లేకుండా పోతుంది. దీంతో ప్రతిపక్ష నేత పదవీ కనుమరుగువుతుంది. జోరుగా సాగుతున్న ‘ఆపరేషన్ ఆకర్ష్’ నేపథ్యంలో ఏం జరుగుతుందో అన్న ఆందోళన కాంగ్రెస్ నేతలకు వణుకు పుట్టిస్తోందట!