అత్తారింట్లో ఆదిత్య
‘నీవు దీనికి సరికాదు’ అన్న చోటునే ‘నువ్వే ఈ వర్క్‌కి సరైనవాడివి’ అనే కితాబు వస్తే.. ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేం. అలాంటి ఆనందాన్ని నేను చవిచూశాను. ఆనందాన్ని ఇవ్వలేనిది ఎంత గొప్ప పనైనా ‘నో’ చెప్పడానికి వెనకాడను, నాకు ఏది నప్పుతుందో అదే నన్ను వెతుక్కుంటూ వస్తుంది’ అంటూ ఇలా ఎన్నో కబుర్లు చెప్పుకొచ్చాడు ఆకర్ష్ బైరమూడి.
‘పున్నాగ’ సీరియల్‌తో తెలుగు బుల్లితెరకు అనిరుథ్గా పరిచయమై ‘జీ తెలుగు’లో వచ్చే ‘అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు’ సీరియల్లో ఆదిత్యగా అలరిస్తున్న ఆకర్ష్ చెప్పే కబుర్లు కూడా అంతే ఆకర్షణీయంగా ఉంటాయి. మరిన్ని విశేషాలు ఆకర్ష్ నోటనే విందాం..
‘కాలేజీ చదువు పూర్తయ్యాక ‘ఏం చేయాలా’ అని ఆలోచిస్తున్నప్పుడు కన్నడలోని ఓ టీవీ ఛానెల్ సీరియల్లో హీరోపాత్ర రీప్లేస్‌కు అవకాశం వచ్చింది. అప్పటికి అనుమానంగానే ఒప్పుకున్నాను ఆల్రెడీ ఒక పాత్రలో చూసిన జనం నన్ను యాక్సెప్ట్ చేస్తారా..’ అని. పైగా నటనకు కొత్త. కుటుంబ నేపథ్యం కూడా లేదు. సందేహంగానే మూడు నెలలు ఆ సీరియల్లో యాక్ట్ చేశాను. కానీ, అనుకున్నంత గుర్తింపు రాలేదు. పైగా విమర్శలు వచ్చాయి. ‘నువ్వు యాక్టింగ్‌కి సెట్ అవవు’ అన్నారు చానల్‌వాళ్లు. దాంతో బయటకు వచ్చేశాను.
‘ఈ యాక్టింగ్ మనకు సూట్‌కాదు ఏదో జాబ్ చూసుకుందాం’ అనుకున్నాను. బీటెక్ తర్వాత ఎంబీయేలో చేరాను. ఆ టైమ్‌లోనే హైదరాబాద్ ‘జీ తెలుగు’ నుంచి ఫోన్.. ‘ఆడిషన్స్‌కి రమ్మని.’ అప్పటికే నా మీద నాకు కాన్ఫిడెన్స్ పోయింది. ‘యాక్టింగ్ మానేశాను, రాలేను’ అని చెప్పాను. కానీ, వాళ్లు ఈ సీరియల్‌కి మీరే కరెక్ట్ అనడంతో ఆడిషన్స్‌కి వచ్చాను. వాళ్లిచ్చిన డైలాగ్ ఇంగ్లిష్‌లో రాసుకొని బట్టీ పట్టి అప్పజెప్పాను. కానీ, నాకైతే నమ్మకం లేదు. ‘బెంగుళూరు వాళ్లే రిజెక్ట్ చేశారు.
ఇక్కడ తెలుగు భాష కూడా రాదు. ఇక తెలుగులో అవకాశాలేం వస్తాయి..?’ అనుకున్నాను. కానీ మరుసటి రోజే ‘మీరు సెలక్ట్’ అని ఫోన్ కాల్. దీంతో హైదరాబాద్‌లోనే సెటిల్. మూడు నెలల్లో తెలుగు నేర్చుకున్నాను. ఏడాదిన్నరపాటు పున్నాగ సీరియల్లో నటించాను. ఈ సీరియల్ నాకు మంచి పేరును, గుర్తింపును తెచ్చిపెట్టింది. అక్కణ్ణుంచి మంచి మంచి ప్రాజెక్టులు రావడం ప్రారంభించాయి.
వద్దన్నవారే పిలిచారు
పున్నాగ సీరియల్ తర్వాత కన్నడలో ఏ ఛానెల్ అయితే నన్ను రిజెక్ట్ చేసిందో అదే ఛానెల్ వాళ్లు ఫోన్ చేసి ‘మా సీరియల్లో మీరే చేయాల’ని పట్టుబట్టారు. ముందు వద్దన్నవాళ్లే తర్వాత పిలిచి మరీ ఆఫర్ ఇస్తానంటే ఎందుకు వదులుకోవడం అని వెళ్లాను గానీ అక్కడ వర్క్ నచ్చలేదు. అప్పటికే తెలుగులో మరో సీరియల్‌కి అవకాశం వచ్చింది. తెలుగు నాకు గుర్తింపును, లైఫ్‌ని, సంతోషాన్ని ఇచ్చింది. అందుకే కన్నడ సీరియల్‌కి బై చెప్పి తెలుగు ప్రాజెక్ట్ ‘అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు’ సీరియల్‌కి వచ్చేశాను. ఆ టైమ్‌లో కన్నడ సీరియల్ వాళ్లు మాపై రివెంజ్ తీర్చుకోవడానికే ఇలా చే శాడు అని విమర్శించారు.
నాన్న చాలా హ్యాపీ
నాన్న మాకున్న కాఫీ ఎస్టేట్ వర్క్ చూస్తుంటారు. అమ్మ గృహిణి. అన్నయ్య ఇంటీరియర్ డిజైనర్. చేసే వర్క్ పట్ల సంతృప్తి, సంతోషం ఉంటేనే చేయమంటారు వాళ్లు. నేను టీవీ నటుడిని అవడంతో ఆయన చాలా హ్యాపీ. భాష రాకపోయినా నా సీరియల్‌ని తప్పక చూస్తారు.
నా స్వెటర్‌ని భద్రంగా దాచుకుంది
ఎల్కేజీ రోజుల్లో చదువు కోసం నన్ను ఊటి హాస్టల్లో ఉంచారు అమ్మానాన్నా. ఓ రోజు మా కజిన్ నన్ను ఔటింగ్కని ‘బ్లాక్ థండర్’ ప్లేస్‌కి తీసుకెళ్లారు. అక్కడ నేను తప్పిపోయాను. సెక్యూరిటీ వాళ్లు పేరెంట్స్ పేర్లు అడిగితే చెప్పలేకపోయాను. ఎవరో ఒకావిడ రావడం, వాళ్లతో మాట్లాడడం నన్ను తీసుకెళ్లడం జరిగిపోయింది.
నన్ను తీసుకెళుతున్న ఆవిడ గేటు దాటుతుండగా నా స్వెటర్ చూసి గుర్తుపట్టిన మా కజిన్ గట్టిగా పేరు పెట్టి పిలుస్తూ పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఆమె నన్ను అక్కడ దించేసి వేగంగా వెళ్లిపోయింది. అప్పుడు నేను ఆమెతో ఆ గేటు దాటి ఉంటే మా పేరెంట్స్‌కు ఎప్పటికీ దొరికుండేవాడిని కానని ఇప్పటికీ అనుకుంటాను. ఆ స్వెటర్‌ని మా అమ్మ భద్రంగా దాచుకుంది.
నచ్చినది చేసుకుంటూ వెళ్లడమే!
డ్రీమ్ రోల్ అంటూ ఏమీ లేదు. ఈ ప్రాజెక్ట్ తర్వాత ఏంటి అంటే.. ఏమీ చెప్పలేను. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ హ్యాపీగా ఉండడమే. నాకు ఏది సూటవుతుందో అదే వస్తుంది అని నా గట్టి నమ్మకం.
నిర్మలారెడ్డి