
ప్రచారమో రామచంద్రా
- కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య కానరాని సమన్వయం
- ఎవరికివారుగా ప్రచారం
- కన్నెత్తి చూడని దొంతి మాధవరెడ్డి
- వర్గపోరుతో కొరవడిన ఐకమత్యం
వరంగల్: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ..ప్రచార పర్వంలో మాత్రం ముందుకు వెళ్లడంలేదు. పీసీసీ ఆగ్రనేతలు జిల్లాకు వస్తున్నా ఒకటి రెండు కార్యక్రమాలతో సరిపెట్టి వెళ్లిపోతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ తరఫున జిల్లా నేతల నుంచి ఆశించిన సహకారం లభించడం లేదనే అభిప్రాయం హస్తం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. మొదట తాము విముఖత చూపిన సర్వే సత్యనారాయణ అభ్యర్థిగా రావడాన్ని కాంగ్రెస్ జిల్లా నేతలు ఇంకా మరిచిపోవడంలేదు.
మరోవైపు మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఇంట్లో సంఘటన షాక్ నుంచి కాంగ్రెస్ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోవడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ జిల్లా ముఖ్యనేతల ప్రచార తీరు ఎవరికివారు యమునా తీరు అన్నట్లుగా కొనసాగుతోంది. కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో నియోజకవర్గస్థాయి నాయకులు సైతం ప్రచారం మొదలుపెట్టనే లేదు. కొన్ని మండలాల్లో ద్వితీయశ్రేణి నాయకుల పరిస్థితీ ఇలాగే ఉంది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లోక్‌సభ ఉప ఎన్నికకు పూర్తి బాధ్యుడిగా వ్యవహరిస్తారని జిల్లా నేతలు భావించారు.
నామినేషన్ దాఖలు తర్వాత ఒకటిరెండు రోజులు హడావుడి చేసి ఉత్తమ్ కూడా వెళ్లిపోయారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అంతా తానై వ్యవహరించాలనే యత్నం చేస్తున్నారు. దీన్ని జిల్లా నేతలు అంగీకరించడం లేదు. పొన్నాల వర్గం పెత్తనం చేయడాన్ని వ్యతిరేకిస్తున్న ఆయన ప్రత్యర్థి వర్గం ప్రచారానికి దూరంగా ఉంటోంది. జిల్లాలో కాంగ్రెస్ ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న దొంతి మాధవరెడ్డి ప్రచారంలో పాల్గొనడం లేదు. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్‌కు ఇబ్బందికర పరిణామాలుగా మారుతున్నారుు.
నియోజకవర్గాల్లో ఇదీ పరిస్థితి..
స్టేషన ఘన్‌పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం పరిస్థితి దయనీయంగా ఉంది. లింగాలఘనపురం, రఘునాథపల్లి మండలాల కార్యకర్తలతో నాయకులు మాట్లాడారు. నామమాత్రంగానే ప్రచారం చేస్తున్నారు. సాధారణ ఎన్నికలో పోటీచేసి ఓడిపోయిన జీ.విజయరామారావు ప్రచారంలో కనిపించడం లేదు. రాజారపు ప్రతాప్ దూరమయ్యారు. ఇన్‌చార్జిగా ఉన్న లక్ష్మయ్య పరిస్థితీ అలాగే ఉంది. జిల్లా కేంద్రంలోని తమ ఇళ్లకు కార్యకర్తలను పిలిచి అదే ప్రచారంగా చూపే యత్నాలు ఆ పార్టీ ప్రధాన నేతలు చేస్తున్నారు.
పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు వర్గపోరు నానాటికీ ముదురుతోంది. డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన దుగ్యాల శ్రీనివాస్‌రావుల మధ్య వర్గపోరు నెలకొంది. పీసీసీ అధిష్టానం ఈ నియోజకవర్గ బాధ్యతల విషయంలో నిర్ణయం తీసుకోకుండా చోద్యం చూస్తోంది. ఇది కాంగ్రెస్ శ్రేణుల్లో అయోమయూన్ని మిగిల్చింది. మొత్తంగా ఉప ఎన్నికలో ఇది ప్రభావం చూపే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. జంగా రాఘవరెడ్డి వర్గం మాత్రం కాంగ్రెస్ తరఫున ప్రచారం నిర్వహిస్తోంది.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచారం అంతంత మాత్రంగానే సాగుతోంది. మాజీ మంత్రి సారయ్య పెద్దగా ప్రచారం చేయడంలేదు. డివిజన్ల వారీగా కాంగ్రెస్ బాధ్యులు సైతం ఇదే వైఖరితో ఉంటున్నారు. సర్వే సత్యనారాయణ అభ్యర్థిత్వం విషయంలో మాజీ మంత్రి సారయ్య అసంతృప్తితో ఉండడం వల్లే వరంగల్ తూర్పులో ప్రచారం పెద్దగా జరగడంలేదని కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది. వరంగల్ పశ్చిమలో కాంగ్రెస్ ప్రచారం బాగానే సాగుతున్నా..అది ఆశించిన మేరకు లేదని ఆ పార్టీ నేతలే అంటున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర నేతలు ఎక్కువగా ఇదే నియోకవర్గంలో పర్యటిస్తున్నారు. వీరి వెంట కాంగ్రెస్ జిల్లా నేతలు ఉంటున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జీ బాధ్యతల విషయంలో లోలోపల వర్గపోరు జరుగుతోంది. ఇది క్షేత్రస్థాయిలో ప్రచారంపై ప్రభావం చూపుతోంది.