
వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై మళ్లీ కసరత్తు
హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య కోడలు మరణంతో కాంగ్రెస్ అధిష్టానం డైలమాలో పడింది. తాజా పరిణామాల నేపథ్యంలో పోటీకి రాజయ్య విముఖత చూపడటంతో మరో నేతకు టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. దీంతో స్థానిక అభ్యర్థుల వివరాలను సేకరించే పనిలో పడింది. మరో అభ్యర్థి ఎంపికకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కసరత్తు చేస్తున్నారు. నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోవాలని పలువురు నేతలకు సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
మరోవైపు రాజయ్య కోడలి మరణంపై కాంగ్రెస్ అధిష్టానం ఆరా తీసింది. రాజయ్య ఇంట్లో ఘటన చాలా విషాదకరమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మరో గంటలో వరంగల్ ఉప ఎన్నిక అభ్యర్థిపై ప్రకటన చేస్తామన్నారు. అభ్యర్థి ఎంపికపై హైకమాండ్ పెద్దలతో ఎప్పటికప్పుడూ సంప్రదింపులు జరుపుతున్నారు.