రాబోయే రోజుల్లో కాంగ్రెస్ గల్లంతు
- అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీదే హవా..
- 2019లో తెలంగాణ మాదే
- ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ ధీమా
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: అవినీతికి, ఆశ్రీత పక్షపాతానికి చిరునామాగా ఉండి పాలన కొనసాగించిన కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని, ఏ ఎన్నికల్లో చూసినా ఆ పార్టీకి పరాభవమే మిగులుతోందని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత రమణ్‌సింగ్ అన్నారు. బీజేపీ వికాస్ యాత్రలో భాగంగా మహబూబ్‌నగర్ వచ్చిన ఆయన స్థానిక ఆర్‌అండ్‌బీ విశ్రాంత భవనంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, కేంద్రమంత్రి హన్స్‌రాజ్‌లతో కలసి విలేకరులతో మాట్లాడారు. భవిష్యత్ అంతా బీజేపీదేనని, అస్సాంలో పార్టీ విజయం సాధించిన తరువాత ఇక అన్ని రాష్ట్రాల్లో అదే ఒరవడి కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయన్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో సైతం బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని రమణ్‌సింగ్ వ్యాఖ్యానించారు.
అస్సాంలో గతంలో 5 శాసనసభ స్థానాలుండగా ఇప్పుడు అధికారంలోకి వచ్చే మెజార్టీ ప్రజలిచ్చారని, అదే రీతి లో తెలంగాణలో ఐదుగురు శాసనసభ్యులుండడం వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడానికి సంకేతమని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలు ముందెన్నడూ లేనిరీతిలో జరుగుతున్నాయని, 5 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలన్న నిర్ణయం పేదల జీవితాల్లో వెలుగులు నింపేదిగా ఉందని చెప్పారు. కేంద్రం అమలు చేస్తున్న జన్‌ధన్ యోజన, ముద్ర బ్యాంకు వంటి పథకాలు సామాన్య ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపర్చగలిగాయన్నారు.
తెలంగాణలో రూ.43 వేల కోట్లతో జాతీయ రహదారులను నిర్మిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం సహాయంతో పలు పరిశ్రమలను, మెడికల్ కళాశాలలను రాష్ట్రానికి మంజూరు చేశామని తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ సమస్యపై ప్రస్తావించగా.. గిరిజన గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం ద్వారా మావోయిస్టుల సమస్యను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. గతంలో నీతి ఆయోగ్‌లో రాష్ట్రాల వాటా కేవలం 35 శాతం మాత్రమే ఉండేదని, ఇప్పుడు నరేంద్రమోదీ 42 శాతానికి పెంచడంతో అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.750 కోట్ల కరువు సహాయాన్ని ఇప్పటికే అందించిందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నా రాష్ట్రం వాటిని వేగంగా అమలు చేయలేకపోతుందన్నారు. భారత్ వికాస్ పర్వ్‌లో భాగంగా తెలంగాణలో 8 బృం దాలు పర్యటిస్తున్నాయని, ఇందులో 16 మంది కేంద్రమంత్రులు ఉన్నారని చెప్పారు.