మాకింత విషమిచ్చి చంపేయండి
- ఆ తర్వాతే మా పిల్లలను అనాధలుగా భావించండి
- కనీసం మాకు ఓ మాటా కూడా చెప్పకుండా తరలిస్తారా?
- మేము బతికుండగానే తమ పిల్లలను అనాధలను చేశారు
- దేవుడిపై భారమేసి..ఆపరేషన్ చేయండిః అవిభక్త కవలలు వీణావాణి తండ్రి ఆవేదన
సాక్షి, సిటీబ్యూరో: ‘మాకు ఇంత విషమిచ్చి చంపేయండి. ఆ తర్వాతే వీణవాణిలను అనాధలుగా భావించండి. కనీసం మాకు ఓ మాట కూడా చెప్పకుండా అనాధాశ్రమానికి తరలిస్తారా? మా పిల్లలను మేం చూసుకోవడానికి ఇతరుల అనుమతి తీసుకోవాలా?’ అని అవిభక్త కవలలు వీణావాణి తల్లిదండ్రులు మురళి, నాగలక్ష్మిలు ఆవేదన వ్యక్తం చేశారు. అవిభక్తకవలలు వీణావాణిలను నిలోఫర్ ఆస్పత్రి నుంచి స్టేట్‌హోం తరలించిన విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు సోమవారం వారి వద్దకు వచ్చారు.
పిల్లలను చూసేందుకు అనుమతించాల్సిందిగా పీడీని కోరగా నిమిషం వ్యవధి మాత్రమే ఇచ్చారన్నారు. తమ పిల్లలను చూసుకోవడానికి తాము అనుమతి తీసుకోవాలా? అని ప్రశ్నించారు. కనీసం తెలంగాణ రాష్ట్రంలోనైనా తమ పిల్లలకు న్యాయం జరుగుతుందని భావించాం. స్వరాష్ట్రంలో కూడా తమకు తీరని మనోవేదనే మిగిలిందని ఆరోపించారు. వారికి చికిత్స చేసి వేరు చేయాల్సిందిగా ఇప్పటికే పలు మార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశానని చెప్పారు. తమకు తగిన జీవనభృతిని కల్పిస్తే తమ పిల్లల బాగోగులు చూసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దేవుడిపై భారం వేసి పిల్లలకు చికిత్స చేయాల్సిందిగా కోరారు.
(గుట్టుచప్పుడు కాకుండా వీణావాణీ తరలింపు)
వీణా వాణీలకు సకల సౌకర్యాలు
వెంగళరావునగర్ : వీణావాణీలకు సకల సౌకర్యాలను కల్పించడానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనథ్ చెప్పారు. సోమవారం స్టేట్‌హోం కార్యాలయంలో వీణావాణీలను ఎమ్మెల్యే మాగంటి కలిసి దాదాపు గంటసేపు వారితో ముచ్చటించారు. అక్కడున్న చిన్నారులకు బిస్కెట్లు, చాక్లెట్లు, సిబ్బందికి బహుమతులు పంపిణీ చేశారు.
అనంతరం ఆయన విలేకరులతో మట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ వీణవాణిల చికిత్సపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారన్నారు. ప్రపంచస్థాయి వైద్యులకు చూపించి వారి సలహా మేరకు వారి పోషణను, సంరక్షించే బాధ్యతను మహిళా శిశుసంక్షేమశాఖకు అప్పగించారని అన్నారు.