
కుట్రకు – వైఎస్ అభిమానానికి మధ్య పోటీ
ప్రొద్దుటూరు టౌన్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు కుట్రకు – వైఎస్ అభిమానానికి మధ్య పోటీ అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల దగ్గరపడుతున్న తరుణంలో పార్టీ గుర్తులు ఉండవని తెలిపారు. అభ్యర్థి యెక్క గుణగణాలను పరిశీలించి కుటుంబ రాజకీయ చరిత్రలో విలువలను, శాంతి స్వభావం, వంటి అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఓటు వేయాల్సిన ప్రజా ప్రతినిధులందరూ ఆత్మప్రభోదానుసారం వ్యవహరించాలన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి మసిపూసి అవమానం చేయాలనే తీవ్రమైన సంకల్పంతో పని చేసే దుష్టశక్తులను మీ ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలన్నారు. ఆ కుటుంబానికి అవమానం చేయాలని చూస్తున్న ఆదినారాయణరెడ్డికి మసి పూయాలన్నారు. నాదృష్టిలో ఈ పోటీ కుట్రకు, వైఎస్ అభిమానానికి జరుగుతోందన్నారు. వైఎస్‌ను అభిమానించే వారు ఈనెల 17న గుణపాఠం నేర్పాలన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి గెలుపు జిల్లా ప్రయోజనాలు, అభివృద్ధికి ముడిపడి ఉందన్నారు. మొన్న 100 మంది మెజార్టీ ఉన్నారని ప్రకటించి నిన్న 60 ఓట్లు ఎక్కువని, నేడు మ్యాజిక్ ఫిగర్ ఉందని, రేపు ఓడిపోయాం వైఎస్ అభిమానమే గెలిచిందని టీడీపీ నేతలే చెబుతారన్నారు. మ్యాజిక్ ఫిగర్ అంటే గెలుపు ఖాయం కాలేదని అర్థమని పేర్కొన్నారు. వైఎస్ బొమ్మ పెట్టుకొని గెలిచిన ఆది ఎన్నటికీ ఆయన రుణం తీర్చుకోలేడన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ వంగనూరు మురళీధర్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకా విజయలక్ష్మి పాల్గొన్నారు.