సీమవాసులను మోసం చేసేందుకు కుట్ర
–పవన్ డ్రామాలను నమ్మొద్దు
–రాయలసీమ అభివృద్ధిని మరచిన బాబు
–ఆర్‌పీఎస్ అధ్యక్షుడు బైరెడ్డి ధ్వజం
ఎమ్మిగనూరు:ఽ రాయలసీమ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కోస్తా నేతలు కుట్రపన్నుతున్నారని, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఈప్రాంతంలో సభలు పెట్టి మొసలికన్నీరు కార్చడం అందులో భాగమేనని రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్‌పీఎస్) అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎవరో రాసిచ్చిన డైలాగ్‌లు పవన్ వల్లవేస్తున్నారని, నమ్మి మోసపోవద్దని ప్రజలను కోరారు. శుక్రవారం ఎమ్మిగనూరులో కేఆర్ చిన్నరాఘవరెడ్డి ఇంట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని రాయలసీమకు దక్కనప్పుడు, హైకోర్టు వెళ్లిపోయినప్పుడు, సీమను ఎడారిని చేస్తూ శ్రీశైలం ప్రాజెక్టు నీటిని తరలించుకు పోయినప్పుడు, హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ, కేసీ కెనాల్‌లకు నీరురాక కరువుతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పుడు పవన్‌కల్యాణ్ స్పందించి ఉంటే సంతోషించేవాళ్లమన్నారు. అనంతసభలో సీమకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోయారన్నారు. కోస్తాకు చెందిన ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణలు సీమలో పోటీచేస్తే గెలిపించి గుండెల్లో పెట్టుకున్నారని, వారు మాత్రం ఈ ప్రాంత వాసులను అలా ఆదరించలేదన్నారు. ఇక నుంచి ఎవరైనా ఆ ప్రాంతవాసులు, సినీహీరోలు ఇక్కడికి వచ్చి పోటీచేస్తే వారికి వ్యతిరేకంగా ఆర్‌పీఎస్ బరిలోకి దిగుతుందని హెచ్చరించారు. రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా సొంత ప్రాంతానికి అన్యాయం చేస్తూ ఓట్ల కోసం అభివృద్ధిని కోస్తావైపు మళ్లించారని విమర్శించారు. విభజన తరువాత జరిగిన మొదటి స్వాతంత్ర్య వేడుకల్లో జిల్లాకు 25 హామీలిచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. సమావేశంలో మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ మాచాని నాగరాజు,టైలర్ రఫిక్, తదితరులు పాల్గొన్నారు.