మూడోరోజు 813 మంది హాజరు
మచిలీపట్నం : పోలీస్ కానిస్టేబుళ్ల దేహదారుఢ్య పరీక్షలు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మూడోరోజైన బుధవారం కూడా కొనసాగాయి. 1,200 అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా, 813 మంది హాజరయ్యారు. మిగిలిన వారు వివిధ కారణాలతో వెనుదిరిగారు. అభ్యర్థులకు చాతీ కొలతలు, ఎత్తు, 1,600 మీటర్ల పరుగుపందెం, వంద మీటర్ల పరుగుపందెం, లాంగ్‌జంప్ పోటీలను ఎస్పీ జి.విజయకుమార్ పర్యవేక్షించారు. తెల్లవారుజామున 4 గంటలకే అభ్యర్థులు ఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. పరుగుపందెం పోటీల్లో అస్వస్థతకు గురైన వారికి అక్కడే ఏర్పాటుచేసిన వైద్య శిబిరంలో సేవలందించారు. గురువారం మహిళా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని, ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఎస్పీ తెలిపారు. ఈ ఎంపిక ప్రక్రియను ఏఎస్పీ బీడీవీ సాగర్, అవనిగడ్డ, మచిలీపట్నం డీఎస్పీలు, పలువురు సీఐలు పర్యవేక్షించారు.