రక్తగాయాలతో మహేష్
మల్కాజిగిరి: కేసు విచారణ నిమిత్తం పాతనేరస్తుడిని తీసుకెళ్లేందుకు వచ్చిన కానిస్టేబుళ్లపై దాడి జరిగింది. బాధిత కానిస్టేబుళ్ల ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడ్డవారిపై కేసు నమోదుచేశారు. అయితే, తన భర్త కోసం వచ్చిన పోలీసులు తనతో అసభ్యంగా ప్రవర్తించి, దాడి చేశారని పాతనేరస్తుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇరువర్గాల ఫిర్యాదు మేరకు మల్కాజిగిరి పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇన్ స్పెక్టర్ జానకిరెడ్డి, ఎస్‌ఐ జేమ్స్‌బాబు కథనం ప్రకారం...ఉప్పరిగూడ పార్దిబస్తీకి చెందిన మహేష్‌సింగ్ అలియాస్ మహేష్ పాతనేరస్తుడు. ఇతనిపై గతంలో మల్కాజిగిరి ఠాణాలో పలు కేసులు నమోదయ్యాయి. ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలో కేసుకు సంబంధించి మహేష్‌ను తీసుకెళ్లడానికి ఆదివారం ఉదయం కానిస్టేబుళ్లు ఎలిజాతో పాటు మఫ్టీ పోలీసులు రాకేష్, జగదీష్ కలిసి మహేష్ ఇంటికి వచ్చారు.
అతడిని తీసుకెళ్లే క్రమంలో భార్య పూనమ్, సోదరులు బాబూసింగ్, ఉమేష్‌సింగ్ అడ్డుకొని దాడికి పాల్పడ్డారు. కానిస్టేబుల్ జగదీష్ చేతి వేలికి గాయమైంది. దీంతో కానిస్టేబుల్ ఎలిజా.. మహేష్ కుటుంబసభ్యులపై ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా... మహేష్ అక్కను దూషించడంతో పాటు తనతో కానిస్టేబుళ్లు అసభ్యంగా ప్రవర్తించి దాడికి పాల్పడ్డారని మహేష్ భార్య పూనమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త మహేష్‌ను రక్తం వచ్చేలా పోలీసులు గాయపర్చారని పేర్కొంది. ఇరు వర్గాల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్ చెప్పారు.