సమస్యల ఏకరువు
- కొనసాగుతున్న ‘వైఎస్సార్ కుటుంబం’
- తమ సాధక బాధలను చెప్పుకుంటున్న జనం
– ప్రభుత్వంపై పోరాడాదమని ప్రజలకు నేతల భరోసా
అనంతపురం: పింఛన్ రాలేదని ఓ అవ్వ ఆవేదన...రుణమాఫీ కాక ఆత్మహత్య చేసుకోవడంతో ఇంటిపెద్దదిక్కును కోల్పోయామని ఓ చేనేత మహిళ రోదన. చిన్న ఇల్లు కట్టుకుందామంటే రెండేళ్లుగా తిరుగుతున్నా ఫలితం లేదని పేదల ఆరోపణ...ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ప్రతి ఇంటిలోనూ ఏదో ఒక సమస్య. మూడున్నరేళ్ల్ల తర్వాత ప్రభుత్వ తీరుతో తాము ఎలా మోసపోతున్నామో జనం బహిరంగంగా గొంతెత్తి చెబుతున్నారు. ప్రభుత్వ వైఖరితో అన్యాయానికి గురవుతున్నవారు, మోసపోయిన వారు తమ సమస్యలు చెప్పుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ‘వైఎస్సార్ కుటుంబం’ను వేదిక చేసుకుంటున్నారు. ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు.
బుధవారం ఉరవకొండ నియోజకవర్గం పరిధిలోని ఉరవకొండ పట్టణం, రాయంపల్లి, చిన్న ముష్టూరు, పెద్దముష్టూరు, నింబగల్లు, రాకెట్ల, షెక్షానుపల్లి, లత్తవరం, బెళుగుప్ప మండలం బెళుగుప్ప తండాలో ‘వైఎస్సార్ కుటుంబం’ కార్యక్రమం నిర్వహించారు. ఉరవకొండ పట్టణం, రాయంపల్లిలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం రాజీవ్‌కాలనీ, పెనుకొండ మండలం నాగలూరుతో పాటు పరిగి, రొద్దం మండలాల్లో కార్యక్రమం జరిగింది. గుంతకల్లులోని 1, 15, 19, 34, 35 వార్డుల్లో కార్యక్రమం జరగగా...34, 35 వార్డుల్లో నియోజకవర్గ సమన్వయకర్త వై. వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. రాయదుర్గం నియోజవర్గ పరిధిలోని రాయదుర్గం మండలం బొమ్మక్కపల్లిలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
అలాగే మెచ్చిరి, సదం, వీరాపురం, కొండాపురం, రాయంపల్లి, ఆవులదట్ల, హీరేహాల్ మండలం సోమలాపురం, లింగమనహళ్లి, బొమ్మనహాల్ మండలం ఉద్దేహాల్, కొత్తూరు, కోనాపురం, దర్గాహొన్నూరు, కనేకల్ మండలం కలేకుర్తి, పూలచెర్ల, సోలాపురం, మాల్యం తదితర గ్రామాల్లో వైఎస్సార్ కుటుంబం కార్యక్రమాన్ని నిర్వహించారు. శింగనమల నియోజకవర్గం సలకంచెరువు, శింగనమల, తరిమెల, పుట్లూరు మండలం రంగరాజుకుంట, జంగమరెడ్డిపేట, బుక్కరాయసముద్రం మండలం బుక్కరాయసముద్రం, చెన్నంపల్లి గ్రామాల్లో జరిగింది. బుక్కరాయసముద్రంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి పాల్గొన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం బహ్మ్రసముద్రం మండలం పోలేపల్లి, పడమటి కోడిపల్లితో పాటు మరో ఐదు గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మడకశిర, కదిరి నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లోనూ వైఎస్సార్ కుటుంబం కార్యక్రమం జరిగింది.