- కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం నాయకులు డిమాండ్
- కలెక్టరేట్ ముట్టడించి ధర్నా
అనంతపురం అర్బన్ : ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వం డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కాంట్రాక్టు లెక్చరర్ల సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌ని కాంట్రాక్ట్ లెక్చరర్లు ముట్టడించి గేటు ముందు బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర, జిల్లా నాయకులు ఎర్రప్ప, సుబ్రమణ్యం, రామాంజినేయులు తదితరులు మాట్లాడారు. ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తోందని మండిపడ్డారు.
సీఆర్‌సీ రికమెండేషన్ పేజీ 188–15 (బి) కాలేజ్‌యేట్ ఎడ్యుకేషన్ పేరా–2లో స్పష్టంగా కాంట్రాక్టు లెక్చరర్లకు మూలవేతనంతో పాటు డీఏ కూడా ఇవ్వాలని సిఫారసు చేసిందన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఇటీవల సుప్రీంకోర్టు తెలిపిందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని టీడీపీ ఎన్నికల మేనిఫేస్టోలో హామీ ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత పట్టించుకోలేదని మండిపడ్డారు. కాంట్రాక్టు లెక్చరర్లను బేషరతుగా కమ్రబద్ధీకరించాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్‌ఓ సి.మల్లీశ్వరిదేవికి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని నాయకులు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు వేణు, రవిరాజు, సుజాత, అనిత, మైథిలి, తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం
Published Tue, Nov 29 2016 11:19 PM | Last Updated on Mon, Sep 4 2017 9:27 PM
Advertisement
Advertisement