విద్యుత్ స్తంభంపై మరమ్మతులు నిర్వహిస్తుండగా కరెంట్ సరఫరా జరగడంతో విద్యుద్ఘాతానికి గురై ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎసై ్స లింగ్యానాయక్, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం మిద్దెమీదిపల్లె గ్రామానికి చెందిన సాంబశివారెడ్డి (32) గత 12 సంవత్సరాల క్రితం నగరానికి వలస వచ్చి సురారం డివిజన్ న్యూ షాపూర్‌నగర్‌లో ఉంటున్నాడు.
గత 12 సంవత్సరాలుగా జీడిమెట్ల సబ్ డివిజన్ షాపూర్‌నగర్ సెక్షన్ ఎస్‌ఎస్-2లో కాంట్రాక్ట్ లేబర్‌గా పని చేస్తున్నాడు. సాంబశివారెడ్డికి భార్య రాజేశ్వరి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆదివారం ఉదయం జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతం ఫేజ్-4 ఎక్స్‌టెన్షన్ రోడ్డు నెంబర్ 52లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. కాంట్రాక్టర్ ఆదేశాల మేరకు రాంబాబు, శేఖర్, కొండల్ అనే మరో ముగ్గురితో కలసి మరమ్మతులు నిర్వహించేందుకు సాంబశివారెడ్డి అక్కడకు వెళ్లాడు.
అక్కడకు వెళ్లేముందే శాంబశివారెడ్డి సబ్‌స్టేషన్‌లో ఎల్‌సీ తీసుకున్నాడు. ముగ్గురు ఉద్యోగులు కింద ఉండగా సాంబశివారెడ్డి మాత్రం స్తంభం పైకి ఎక్కి మరమ్మతులు నిర్వహిస్తున్నాడు. ఒక్కసారిగా విద్యుత్ సరఫరా జరగడంతో సాంబశివారెడ్డి బిగ్గరగా ఆర్తనాదాలు చేశాడు. వెంటనే కింద ఉన్న ముగ్గురు ఉద్యోగులు అతని కాపాడేందుకు ప్రయత్నించగా అంతలోనే సాంబశివరెడ్డి స్తంభంపై నుండి కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. సంఘటనా స్థలాన్ని జీడిమెట్ల ఏడి భాగయ్య, ఎసై ్స లింగ్యానాయక్ సందర్శించారు. సాంబశివారెడ్డి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.