మ్యాన్ హోల్ ఘటనలో పాపం వీరిదే..!
సాక్షి, సిటీబ్యూరో/గచ్చిబౌలి: నగరంలో మ్యాన్‌హోళ్ల నిర్వహణ అధ్వాన్నంగా మారింది. మూతలు లేనివి, మురుగు ప్రవాహం అధికంగా ఉండి ఉప్పొంగుతున్న మ్యాన్‌హోళ్ల మరమ్మతులు, నిర్వహణ పనుల్లో లెక్కకుమిక్కిలి అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. జలమండలి క్షేత్రస్థాయి, ఉన్నతాధికారులు కాంట్రాక్టర్లు మిలాఖత్ అయి సాగిస్తోన్న అక్రమాల్లో తరచూ అమాయకులైన కార్మికులు సమిధలవుతున్నారు. మహా నగరంలో సుమారు ఆరువేల కిలోమీటర్ల మేర మురుగునీటి పారుదల వ్యవస్థ అందుబాటులో ఉంది. వీటిపై రెండులక్షలకు పైగా మ్యాన్‌హోల్ మూతలున్నాయి. వీటిలో నిత్యం పలు ప్రాంతాల్లో మురుగు నీటి ప్రవాహం పెరిగి మ్యాన్‌హోళ్లు ఉప్పొంగడం సర్వసాధారణం.
కొన్నిచోట్ల మ్యాన్‌హోళ్లలో ప్లాస్టిక్, ఇతర ఘనవ్యర్థాలు పోగుపడి నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. వీటికి తోడు శేరిలింగంపల్లి, గోపనపల్లి తదితర ప్రాంతాల్లో గతంలో చేపట్టిన సీవరేజి మాస్టర్‌ప్లాన్ పనులకు సంబంధించి మురుగు దారిమళ్లింపు(డైవర్షన్‌మెయిన్) పనులు, జంక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ పనులు చేజిక్కించుకున్న సంస్థలు బయటి వ్యక్తులకు సబ్ కాంట్రాక్టులిచ్చి పనులు చేయిస్తున్నాయి. ఈ క్రమంలో నైపుణ్యంలేని కార్మికులను మ్యాన్‌హోళ్లలోకి దించుతున్నారు.
క్షేత్రస్థాయిలో ఇలాంటి అక్రమాలు చోటుచేసుకుంటున్నా ఆయా ప్రాంతాల్లో పనులను పర్యవేక్షించాల్సిన క్షేత్రస్థాయి మేనేజర్లు, డీజీఎంలు, జీఎంలు సహా ఉన్నతాధికారులు సైతం మామూళ్ల మత్తులో జోగుతూ, కాంట్రాక్టర్లకు వంత పాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాదాపూర్‌లో జరుగుతున్న సీవరేజి డైవర్షన్ మెయిన్ పనులకు సంబంధించి కొందరు ఉన్నతాధికారులే తమ బినామీలతో పనులు చేయిస్తున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇక పనులు జరుగుతున్న ప్రాంతాల్లో వరుస తనిఖీలు జరిపి అవసరమైన సలహాలు, సూచనలు అందించడంలోనూ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
ఏడాదిగా మూడు దుర్ఘటనలు..
తాజాగా మాదాపూర్ అయ్యప్ప సొసైటీ వద్ద జరిగిన ఘోర దుర్ఘటనలో నలుగురు మృతిచెందగా..అంతకు ముందు ఇదే ప్రాంతంలో మ్యాన్‌హోల్‌లో పడి ఓ కార్మికుడు మృత్యువాతపడ్డారు. అంతకు ముందు సుల్తాన్‌బజార్‌లో ఇద్దరు అడ్డాకూలీలు మ్యాన్‌హోల్‌ను శుద్ధి చేసే క్రమంలో అందులోకి దిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ మూడు సంఘటనలు ఇదే ఏడాది చోటుచేసుకోవడం గమనార్హం. గత రెండు దశాబ్దాలుగా ఇలాంటి ఘోర దుర్ఘటనల్లో 25 మంది వరకు కార్మికులు మృత్యువాతపడడం పట్ల సర్వత్రా ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి.