రోడ్డెక్కిన పుష్కర పనుల కాంట్రాక్టర్లు
Published Mon, Sep 19 2016 9:45 PM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM
నరసాపురం : గోదావరి పుష్కరాల్లో అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో వారు ఆందోళనబాట పట్టారు. సోమవారం నరసాపురంలో రిలే దీక్షలు ప్రారంభించారు. పనులు పూర్తి చేసి ఏడాది దాటినా ఇప్పటికీ బిల్లులు చెల్లించకపోవడంతో తాము అప్పుల ఊభిలో కూరుకుపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లు గుత్తుల సత్యనారాయణ, కోటిపల్లి దొరయ్య, గోరు సత్తిబాబు మాట్లాడుతూ పుష్కరాల సమయంలో తక్కువ సమయంలో పనులు పూర్తి చేయాల్సి వచ్చిందని, అధికారుల ఒత్తిడి కారణంగా యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేశామని, పుష్కరాలు పూర్తయిన వెంటనే బిల్లులు చెల్లిస్తామని చెప్పడంతో రూ.లక్షల రూపాయలు అప్పులు తెచ్చి పనులు చేశామని, పనులు పూర్తి చేసి 14 నెలలు అయినా బిల్లులు ఇవ్వకపోవడంతో తెచ్చిన అప్పుల కంటే వడ్డీలు ఎక్కువయ్యాయని వాపోయారు. సుమారు రూ. 7 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని చెప్పారు. తొలిరోజు దీక్షలో కాంట్రాక్టర్లు యర్రంశెట్టి పార్ధసారధి, గుగ్గలపు శివరామకృష్ణ, అడబాల బాబులు, యాతం పెద్దిరాజు, చినిమిల్లి మురళీకృష్ణ, కంబాల మామాజీ, ఆచంట మూర్తి, కొండ్రెడ్డి బాబు, పెరికల హరిబాబు తదితరులు కూర్చున్నారు. వైఎస్సార్ సీపీ మునిసిపల్ ఫ్లోర్‌లీడర్ సాయినాథ్ ప్రసాద్ తదితరులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.
Advertisement